పవన్ రెండో దశ వారాహి యాత్రకు డేట్ ఫిక్స్.. ఈసారి అక్కడి నుంచే
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టిన వారాహి యాత్ర రెండో దశకు డేట్ ఖారారైంది. ఏలూరు నుంచి రెండో విడత యాత్ర చేపట్టనున్నట్లు ఆ పార్టీ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ నెల 9వ తేదీ సాయంత్రం 5 గంటలకు ఏలూరులో నిర్వహించే బహిరంగ సభతో రెండోదశ యాత్ర ప్రారంభమవుతుందని జనసేన పార్టీ పెద్దలు తెలిపారు. ఈ రెండో దశ యాత్ర గురించి చర్చించేందుకు మంగళగిరి పార్టీ కార్యాలయంలో పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్‌తో పవన్ సుదీర్ఘంగా చర్చించారు. ఏలూరులో సభ అనంతరం దెందులూరు, తాడేపల్లిగూడెం, ఉంగుటూరు, తణుకు నియోజకవర్గాల్లో వారాహి యాత్ర కొనసాగే అవకాశం ఉంటుంది. ఇక పవన్ కళ్యాణ్ చేపట్టిన మొదటి విడత వారాహియాత్ర సూపర్ సక్సెస్ అయింది.
వారాహి యాత్రకు ప్రజల నుండి విశేష స్పందన
వారాహి యాత్రకు ప్రజల నుంచి కూడా భారీ స్పందన వచ్చింది. ఇసుకేస్తే రాలనంతగా ప్రజలు రావడంతో ప్రతిపక్ష పార్టీల్లో కొద్దిపాటి ప్రకంపనలు మొదలయ్యాయి. వారాహి తొలి విడత యాత్ర మొత్తం ప్రజా సమస్యలపైనే పవన్ కళ్యాణ్ మాట్లాడారు. ముఖ్యంగా వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. అదే విధంగా అధికార పార్టీకి చెందిన కొందరు కాపు, రెడ్డి సామాజిక వర్గం నేతలు పవన్ కళ్యాణ్‌ను టార్గెట్ చేసి మరీ విమర్శలు చేయడంతో రాష్ట్రంలో ఒక్కసారిగా కుల రాజకీయాలు చెలరేగాయి. కాపు ఉద్యమ నేత ముద్రగడ, కాపు సీనియర్ నేత హరి రామ జోగయ్య మధ్య మాటల యుద్ధం జరిగింది.