LOADING...
Chandrababu Naidu: దావోస్ వేదికగా పెట్టుబడుల సమీకరణ.. వ్యూహాత్మక ప్రణాళికతో సీఎం చంద్రబాబు బృందం!
దావోస్ వేదికగా పెట్టుబడుల సమీకరణ.. వ్యూహాత్మక ప్రణాళికతో సీఎం చంద్రబాబు బృందం

Chandrababu Naidu: దావోస్ వేదికగా పెట్టుబడుల సమీకరణ.. వ్యూహాత్మక ప్రణాళికతో సీఎం చంద్రబాబు బృందం!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 19, 2026
01:38 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్‌కు భారీ ఎత్తున పెట్టుబడులను ఆకర్షించడమే ప్రధాన లక్ష్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్విట్జర్లాండ్ పర్యటనకు బయల్దేరారు. కాసేపట్లో జూరిచ్‌కు చేరుకోనున్న సీఎం, అక్కడి నుంచి దావోస్‌కు వెళ్లి నాలుగు రోజుల పాటు జరగనున్న ప్రపంచ ఆర్థిక వేదిక (వరల్డ్ ఎకనామిక్ ఫోరం - WEF) సదస్సులో పాల్గొననున్నారు. ఈ పర్యటనలో సీఎం వెంట మంత్రులు నారా లోకేశ్‌, టీజీ భరత్‌, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు పలువురు ఉన్నతాధికారులు ఉన్నారు. ఈ ఏడాది డబ్ల్యూఈఎఫ్ సదస్సుకు రికార్డు స్థాయిలో దాదాపు 130 దేశాల నుంచి 3 వేల మంది ప్రతినిధులు, 60 దేశాల ప్రభుత్వాధినేతలు హాజరుకానున్నట్లు అంచనా. భారతదేశం నుంచి మొత్తం ఏడుగురు ముఖ్యమంత్రులు ఈ సదస్సులో పాల్గొంటున్నారు.

Details

పక్కా వ్యూహంతో ముందుకెళ్తున్న ఏపీ ప్రభుత్వం

ఈ అంతర్జాతీయ వేదికను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకుని రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అనుకూల వాతావరణాన్ని ప్రపంచానికి చాటేందుకు ఏపీ ప్రభుత్వం పక్కా వ్యూహంతో సిద్ధమైంది. ఇందుకోసం ప్రత్యేకంగా పవర్‌పాయింట్ ప్రజెంటేషన్లను కూడా రూపొందించింది. భవిష్యత్ ఆధారిత రంగాలపై ప్రత్యేక దృష్టి సారించిన కూటమి ప్రభుత్వం, గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ అమోనియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), క్వాంటం కంప్యూటింగ్, బయోటెక్నాలజీ వంటి రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రణాళికలు రూపొందించింది. అదేవిధంగా టూరిజం, హాస్పిటాలిటీ, విద్య, వైద్య రంగాల్లోనూ పెట్టుబడులకు విస్తృత అవకాశాలు ఉన్నాయని ప్రపంచ స్థాయి కంపెనీలకు సీఎం బృందం వివరించనుంది.

Details

అమరావతిలో 'క్వాంటం వ్యాలీ' ఏర్పాటుకు ప్రతిపాదన

రాష్ట్రంలో ప్రభుత్వం అమలు చేస్తున్న నూతన పాలసీలు, సంస్కరణలను సదస్సులో ప్రస్తావించనున్నారు. ముఖ్యంగా అమరావతిలో 'క్వాంటం వ్యాలీ' ఏర్పాటు ప్రతిపాదన, లక్ష మంది క్వాంటం నిపుణులను తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రారంభించిన 'అడ్వాన్స్‌డ్ క్వాంటం స్కిల్లింగ్' కోర్సు గురించి డబ్ల్యూఈఎఫ్ వేదికగా ప్రత్యేకంగా వివరించనున్నారు. ఇప్పటికే ఈ కోర్సులో 50 వేల మంది నమోదు చేసుకున్న అంశాన్ని పారిశ్రామికవేత్తల దృష్టికి తీసుకెళ్లనున్నారు. అలాగే కాకినాడలో ఏర్పాటు చేస్తున్న గ్రీన్ అమోనియా-గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి ప్లాంట్ ప్రాజెక్టును కూడా ప్రధానంగా ప్రస్తావించనున్నారు.

Advertisement

Details

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుమారు రూ.2.36 లక్షల కోట్లు

గతేడాది (2025) జరిగిన డబ్ల్యూఈఎఫ్ సదస్సులో నిర్వహించిన చర్చల ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుమారు రూ.2.36 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించగలిగింది. ఈసారి అంతకుమించిన పెట్టుబడులను రాబట్టాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. పర్యటన తొలి రోజే సీఎం చంద్రబాబు మొత్తం ఏడు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఇందులో భాగంగా 20 దేశాల నుంచి హాజరయ్యే తెలుగు ప్రజలతో 'తెలుగు డయాస్పోరా' వేదికగా ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు.

Advertisement