Nirmala Sitharaman: సోషల్ మీడియాలో కాదు.. పార్లమెంటులో చర్చకు రండి: రాహుల్‌కు నిర్మల సవాల్
ఈ వార్తాకథనం ఏంటి
సోషల్ మీడియాలో సవాళ్లు విసరడం కాకుండా, పార్లమెంటులో చర్చకు రావాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి సూచించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బహిరంగ చర్చకు సిద్ధమా? అంటూ రాహుల్ గాంధీ చేసిన సవాల్‌పై ఆమె స్పందించారు. చర్చలకు పార్లమెంటే సరైన వేదిక అని, సోషల్ మీడియా కాదని స్పష్టం చేశారు. ఈ మేరకు తన 'ఎక్స్' ఖాతాలో రాహుల్ గాంధీని ఉద్దేశించి వరుస పోస్టులు చేశారు.
వివరాలు
చర్చలకు సరైన వేదిక పార్లమెంట్ అని స్పీష్టీకరణ
"రాహుల్ జీ.. చర్చకు వేదికను ఎంచుకోవాలని మీరు ప్రధానిని కోరుతున్నారు. కానీ, చర్చకు ఇప్పటికే ఒక వేదిక ఉంది. అదే పార్లమెంట్. దానికి మీరే ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు" అని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు.
ఓటర్ల జాబితాల ప్రత్యేక సవరణ (ఎస్ఐఆర్), ఈవీఎంల పనితీరుపై చర్చించేందుకు పార్లమెంటులో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా సోమవారమే ప్రతిపాదించిన విషయాన్ని ఆమె గుర్తుచేశారు.
సోషల్ మీడియాలో సవాళ్లు విసిరేందుకు చూపిస్తున్న ఉత్సాహాన్ని పార్లమెంటులో చర్చకు ఎందుకు చూపించడం లేదని ప్రశ్నించారు.
వివరాలు
ఘాటుగా స్పందించిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
ప్రభుత్వం సమాధానాలు ఇచ్చేందుకు ప్రయత్నించిన ప్రతిసారీ కాంగ్రెస్, ఇండియా కూటమి నేతలు సభ నుంచి వాకౌట్ చేస్తున్నారని నిర్మలా సీతారామన్ ఆరోపించారు.
"ప్రభుత్వాన్ని సమాధానాలు అడిగే హక్కు మీకు ఉంది. అయితే, ఆ సమాధానాలను వినాల్సిన బాధ్యత కూడా మీపై ఉంది. ప్రభుత్వం స్పందిస్తున్న సమయంలో మీరు, మీ పార్టీ సభ్యులు పలుమార్లు సభ నుంచి బయటకు వెళ్లిపోయారు. అలాంటప్పుడు చర్చకు ఎంతో ఆసక్తిగా ఉన్నామని ఎలా చెప్పుకుంటారు?" అని ఆమె నిలదీశారు.
వివరాలు
ఆధారాలతో చర్చకు వచ్చి, ప్రజాస్వామ్య సంస్థలను గౌరవించాలని సూచన
ప్రతిపక్షాల ఆందోళనల కారణంగా పార్లమెంట్ సమావేశాలు సజావుగా సాగడం లేదని నిర్మల విమర్శించారు.
చర్చలపై నిజంగా ఆసక్తి ఉంటే,సభా కార్యకలాపాలు సజావుగా జరిగేలా ప్రతిపక్షాలు సహకరించాలని సూచించారు.
ఇటీవల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి నివాసంలో నిర్వహించిన"మాక్ పార్లమెంట్" కార్యక్రమంపైనా ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు.
అది మాక్ పార్లమెంట్‌లా కాకుండా, పార్లమెంటును అపహాస్యం చేసే కార్యక్రమంలా ఉందని ఎద్దేవా చేశారు.
ప్రజాస్వామ్యం, రాజ్యాంగం గురించి మాట్లాడేవారు ముందుగా ప్రజాస్వామ్య సంస్థలను గౌరవించాలని నిర్మలా సీతారామన్ హితవు పలికారు.
"డరో మత్ (భయపడొద్దు) అని మీరు చెబుతుంటారు కదా. అలాంటప్పుడు వాస్తవాలు, ఆధారాలతో పార్లమెంటుకు రండి. విమర్శలను ఎదుర్కోండి.
ప్రభుత్వం ఇచ్చే సమాధానాలను వినేందుకు సభలో కూర్చోండి" అని రాహుల్ గాంధీకి సవాల్ విసిరారు.