Deepavali In Delhi: దిల్లీలో పతనమైన గాలి నాణ్యత.. 'తీవ్రమైన' కేటగిరీ నమోదు
దిల్లీ జాతీయ రాజధానిలో వాయు కాలుష్యం పెనం మీది నుంచి పొయ్యి మీద పడ్డట్టుగా ఉంది. గత కొద్ది రోజులుగా పర్వాలేదనిపించిన పొల్యూషన్ ఫేలవమైన కేటగిరీ నుంచి తీవ్రమైన కాలుష్యంగా మారింది. దీపావళి సందర్భంగా టాపాసులు కాల్చకూడదన్న నిషేధం ఉన్నప్పటికీ దిల్లీ వాసులు దాన్ని ఉల్లంఘించారు. ఫలితంగా మంగళవారం నగర వీధుల్లో విషపూరితమైన పొగమంచు చుట్టుముట్టింది. దిల్లీలోని చాలా ప్రాంతాలు 'తీవ్రమైన' కేటగిరీ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI)లో నమోదైనట్లు సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (CCB) వెల్లడించింది. దీపావళి సందర్భంగా సుప్రీంకోర్టు విధించిన పటాకుల నిషేధాన్ని పౌరులు ఉల్లంఘించిన రెండు రోజుల తర్వాత మంగళవారం గాలి నాణ్యత 'తీవ్రమైన' స్థాయికి పతనమైంది.
తూర్పు దిల్లీ, నైరుతి ప్రాంతంలోనే అత్యధిక కేసులు నమోదు
ఉదయం 6 గంటలకు,బవానాలోని AQI 434, ద్వారకా సెక్టార్ 8లో 404, ITOలో 430, ముండ్కాలో 418, నరేలాలో 418, ఓఖ్లాలో 402, రోహిణి మరియు ఆర్కే పురం రెండింటిలో 417 వద్ద రికార్డ్ అయ్యాయి. పటాకులు పేల్చడంపై దిల్లీ పోలీసులు సోమవారం 97కేసులు నమోదు చేశారు.తూర్పు దిల్లీ, నగరంలోని నైరుతి ప్రాంతంలోనే అత్యధిక ఈ కేసులు నమోదయ్యాయి.దిల్లీలోని రోహిణి, ఉత్తర ప్రాంతాల్లో ఎటువంటి కేసులు నమోదు కాకపోవడం గమనార్హం. మరోవైపు న్యూదిల్లీ మునిసిపల్ కౌన్సిల్ (NDMC) పార్కింగ్ వాహనాలపై కొరడా ఝులిపిస్తోంది.ఈ మేరకు దిల్లీలో పెరుగుతున్న కాలుష్య స్థాయిల నేపథ్యంలో పార్కింగ్ ఫీజులను రెట్టింపు చేసింది.ఈ ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తుందని, జనవరి 31, 2024 వరకు కొనసాగుతుందని పేర్కొంది.