Air Pollution: దిల్లీలో దీపావళి కాలుష్యం.. గత 8 ఏళ్లలో ఈసారే ఉత్తమం, అయినా తీవ్రంగానే పొల్యూషన్
దిల్లీలో మరోసారి వాయు కాలుష్యం విజృంభిస్తోంది. ఈ మేరకు దీపావళి సందర్భంగా విపరీతంగా టాపాసులు కాల్చడంతో కాలుష్య స్థాయిలు మరోసారి పెరిగాయి. ఈ క్రమంలోనే దిల్లీ జాతీయ రాజధాని పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు కమ్ముకుంది. దీపావళిని పురస్కరించుకుని రాజధాని వాసులు పటాకులతో హోరెత్తించారు. సోమవారం ఉదయం దిల్లీ సహా పరిసర ప్రాంతాలు దట్టమైన పొగమంచుతో కనిపిస్తుండటం ఆందోళనకరంగా మారింది. ఆదివారం సాయంత్రం నాటికి విస్తృతంగా పటాకులు కాల్చడంతో కాలుష్య స్థాయిలు పెరిగి పొగమంచుకు దారితీసింది. ఈ నేపథ్యంలోనే ఉదయం నగరంలోని పలు ప్రాంతాల్లో ఏక్యూఐ స్థాయిలు 900ను అధిగమించడం గమనార్హం. నగరం నడిబొడ్డున ఉన్న ఇండియా గేట్ ప్రాంతంలో 999 వద్ద నమోదైంది. 2023లో ఏక్యూఐ స్థాయి సగటున 218గా నమోదైంది.
నగరంలో అత్యంత కాలుష్య ప్రాంతమేదో తెలుసా
ఇదే సమయంలో మేజర్ ధ్యాన్ చంద్ నేషనల్ స్టేడియం ప్రాంతంలో AQI ఉదయం 999 వద్ద రికార్డ్ అయ్యింది. అనంతరం క్రమంగా 553కి పడిపోయింది. నగరంలోని అత్యంత కలుషిత ప్రాంతాల్లో ఒకటైన ఆనంద్ విహార్ ఏరియాలోనూ గాలి నాణ్యత తీవ్రంగా పతనమైంది. అక్టోబరు చివరివారంలో తీవ్రమైన వాయు కాలుష్యం నెలకొంది. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలతో గత శుక్రవారం నాటికి కాలుష్య తీవ్రత తగ్గింది.ఇదే సమయంలో శని, ఆదివారాల్లోనూ దిల్లీలో ఆకాశం నిర్మలంగా ఉంది. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (CPCB) డేటా ప్రకారం, దిల్లీలో గతేడాది దీపావళికి ఏక్యూఐ 2022లో 312 , 2021లో 382, 2020లో 414, 2019లో 337, 2018లో 281, 2017లో 319, 2016లో 431గా నమోదైంది.