Delhi Air Pollution: గ్రాఫ్ 3 అమలు చేయాలని ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం.. ఏవి నిషేధించారంటే?
రాజధాని దిల్లీలో గాలి నాణ్యత ప్రస్తుతం అత్యంత క్షీణ స్థాయిలో ఉంది. గురువారం,ఢిల్లీలో ఏక్యూఐ స్థాయి 400 దాటింది, ఇది తీవ్ర కాలుష్యాన్ని సూచిస్తుంది. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని,ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ కమిషన్ (AQMC)నవంబర్ 15 నుండి గ్రాప్-3 నిబంధనలను అమలు చేయాలని నిర్ణయించింది. గ్రాప్-3 ప్రకారం,కాలుష్యం క్రమంగా తగ్గే వరకు నిర్మాణ పనులు నిలిపేస్తారు. భవనాల కూల్చివేతలు, మైనింగ్,ఇతర సంబంధిత కార్యకలాపాలు కూడా నిలిపివేయాలని నిర్ణయించారు. అదేవిధంగా, ప్రాథమిక పాఠశాలలలో ఆన్‌లైన్ తరగతులు నిర్వహించే ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. గత రెండు రోజులుగా ఢిల్లీలో గాలి నాణ్యత అత్యంత ప్రమాదకరంగా మారింది.దీనితో పాటు, గురువారం ఢిల్లీ ప్రభుత్వం గ్రీన్ వార్ రూమ్‌లో పర్యావరణ శాస్త్రవేత్తలతో చర్చలు జరిపింది.
ఢిల్లీ గాలి పీల్చడం ఆరోగ్యానికి ప్రమాదకరం
ఈ సందర్భంగా,పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్,కాలుష్యాన్ని నియంత్రించేందుకు తీసుకునే చర్యలను ఖచ్చితంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. పంజాబ్, హర్యానా ప్రాంతాలలో పంట వ్యర్థాలను కాల్చడం వల్ల ఉత్పన్నమయ్యే పొగ దృష్ట్యా,ఢిల్లీకి గాలి కాలుష్యం మరింత పెరిగింది. ఈ పొగ, ఢిల్లీ నగరాన్ని గ్యాస్ ఛాంబర్‌కు సమానం చేసినట్లుగా మారింది. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (CPCB) తాజా డేటా ప్రకారం, ఢిల్లీలో సగటు ఏక్యూఐ 452కి చేరింది. సైన్స్ మ్యాగజైన్ "లాన్సెట్ న్యూరాలజీ"జర్నల్‌లో ఇటీవల ప్రచురితమైన ఒక అధ్యయనంలోని వివరాల ప్రకారం,వాయు కాలుష్యం మూలంగా సబ్-రాక్నోయిడ్ హెమరేజ్(బ్రెయిన్ స్ట్రోక్)కేసులు పెరిగిపోతున్నాయని వెల్లడైంది. తీవ్ర గాలి కాలుష్యం అనేక సందర్భాల్లో అంగ వైకల్యాన్ని,గుండె వైఫల్యాన్ని కలిగించే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.