
Delhi Exit Polls: దిల్లీలో బీజేపీకే అధికారం.. ఎగ్జిట్ పోల్స్ అంచనాలివే!
ఈ వార్తాకథనం ఏంటి
దేశ రాజధానిలో 70 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి,ఇందులో 699 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.
ఓటింగ్ పూర్తవడంతో,అభ్యర్థుల భవితవ్యం EVMలలో భద్రపరచబడింది.
ఈ ఎన్నికల ఫలితాలు ఫిబ్రవరి 8న వెల్లడికానున్నాయి.అయితే,ఫలితాలకు ముందు ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వెలువడ్డాయి.
ప్రస్తుతం ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) అధికారంలో ఉంది.అతిషి ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారు.
2013, 2015, 2020ఎన్నికల్లో వరుసగా విజయం సాధించిన AAP, అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
కానీ 2024లో లిక్కర్ స్కామ్‌కు సంబంధించి మనీలాండరింగ్ కేసులో చిక్కుకున్న కేజ్రీవాల్, మార్చిలో జైలుకు వెళ్లాల్సి వచ్చింది.
అనంతరం సెప్టెంబరులో బెయిల్‌పై విడుదలైన ఆయన, తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. దీంతో పార్టీ అతిషిని కొత్త ముఖ్యమంత్రిగా ప్రకటించింది.
వివరాలు
ప్రతిష్టాత్మక పోటీ - AAP, BJP, కాంగ్రెస్ మద్దతు పరీక్ష
ఈ ఎన్నికలు ఆమ్ ఆద్మీ పార్టీకి కీలకమైనవి. అధికారాన్ని నిలబెట్టుకోవాలన్న సంకల్పంతో AAP పోటీకి దిగగా,ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీజేపీ మళ్లీ అధికారంలోకి రావాలని తీవ్రంగా ప్రయత్నిస్తోంది.
కాంగ్రెస్ కూడా తన పూర్వ వైభవాన్ని తిరిగి పొందేందుకు పోటీలో ఉంది.
1993లో ఢిల్లీలో బీజేపీ విజయం సాధించినప్పటికీ,ఆ తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయం దక్కలేదు.
1998,2003,2008 ఎన్నికల్లో కాంగ్రెస్ వరుసగా విజయం సాధించగా, షీలా దీక్షిత్ ముఖ్యమంత్రిగా పదేళ్లపాటు పాలించారు.
ప్రస్తుతం ఎన్నికల్లో AAPకు బీజేపీ, కాంగ్రెస్ నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది.
ఈ ఎన్నికల్లో దాదాపు 1.56 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటలకు ముగిసింది.
వివరాలు
ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఎలా ఉన్నాయి?
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు విడుదలయ్యాయి.
MATRIZE సర్వే ప్రకారం, AAP, BJP మధ్య పోటీ తీవ్రంగా ఉంది. ఆమ్ ఆద్మీ పార్టీ 32-37 స్థానాలను గెలుచుకునే అవకాశం ఉండగా, బీజేపీ 35-40 స్థానాలను సాధించవచ్చని అంచనా. కాంగ్రెస్ కూడా కనీసం ఓ సీటును గెలవొచ్చని భావిస్తున్నారు.
వివిధ సంస్థల ఎగ్జిట్ పోల్స్ అంచనాలు
పీపుల్స్‌పల్స్-కొడిమో: బీజేపీ: 51-60, ఆప్: 10-19 ,కాంగ్రెస్: 0 ఇతరులు: 0
టైమ్స్ నౌ బీజేపీ: 39-45 ఆప్: 29-31 కాంగ్రెస్: 0-2
ఏబీపీ-మ్యాట్రిజ్: బీజేపీ: 35-40 ఆప్: 32-37 కాంగ్రెస్: 0-1
రిపబ్లికన్ మార్క్: బీజేపీ: 39-41 ఆప్: 21-31
చాణక్య బీజేపీ: 39-44 ఆప్: 25-28
వివరాలు
ఎగ్జిట్ పోల్స్‌కు సంబంధించిన నియమాలు ఏమిటి?
భారతదేశంలో ఎగ్జిట్ పోల్స్‌కు సంబంధించిన మార్గదర్శకాలను తొలిసారి 1998లో విడుదల చేశారు.
1951 ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం, ఓటింగ్ పూర్తయ్యే వరకు ఎగ్జిట్ పోల్స్‌ను ప్రసారం చేయకూడదు.
చివరి దశ ఓటింగ్ ముగిసిన అరగంట తర్వాత మాత్రమే ఈ ఫలితాలను ప్రకటించేందుకు అనుమతి ఉంటుంది.
ఎగ్జిట్ పోల్స్ లేదా ఎన్నికలకు సంబంధించిన ఏదైనా సర్వేను, ఓటింగ్ జరుగుతున్న సమయంలో ప్రచారం చేయడం చట్ట విరుద్ధం.
ఎన్నికల కమిషన్ విధించిన మార్గదర్శకాలను ఉల్లంఘిస్తే, 2 సంవత్సరాల వరకు జైలుశిక్ష లేదా జరిమానా లేదా రెండూ విధించవచ్చు.