LOADING...
Delhi: ప్రైవేట్ పాఠశాలల ఫీజుల పెంపును నియంత్రించే బిల్లుకు ఢిల్లీ అసెంబ్లీ ఆమోదం 
ప్రైవేట్ పాఠశాలల ఫీజుల పెంపును నియంత్రించే బిల్లుకు ఢిల్లీ అసెంబ్లీ ఆమోదం

Delhi: ప్రైవేట్ పాఠశాలల ఫీజుల పెంపును నియంత్రించే బిల్లుకు ఢిల్లీ అసెంబ్లీ ఆమోదం 

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 10, 2025
09:45 am

ఈ వార్తాకథనం ఏంటి

ప్రైవేటు,ఎయిడెడ్‌ పాఠశాలల్లో ఫీజులను నియంత్రించేందుకు దిల్లీలోని బీజేపీ ప్రభుత్వం కొత్త చట్టాన్ని ప్రవేశపెట్టింది. 'దిల్లీ స్కూల్‌ ఎడ్యుకేషన్‌ (ట్రాన్స్‌పరెన్సీ ఇన్‌ ఫిక్సేషన్‌ అండ్‌ రెగ్యులేషన్‌ ఆఫ్‌ ఫీజు) బిల్లు - 2025' అనే ఈ బిల్లుకు ఇటీవల అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఈ చట్టం ప్రకారం,పాఠశాల యాజమాన్యాలు మూడేళ్లకొకసారి మాత్రమే ఫీజులు పెంచే హక్కు కలిగి ఉంటాయి. అలాగే, పాఠశాల స్థాయి ఫీజు నియంత్రణ కమిటీ ఆమోదించిన పరిమితి మేరకే పెంపు అనుమతించబడుతుంది. ఢిల్లీ పరిధిలోని అన్ని ప్రైవేటు, అన్‌ఎయిడెడ్‌ పాఠశాలలకు ఇది వర్తించనుంది. గుర్తింపు ఉన్నా లేకపోయినా ఈ చట్టం అమలులో ఉంటుంది. ప్రభుత్వం రాయితీ ధరలకు భూములు కేటాయించి ఏర్పాటు చేసిన మైనారిటీ సంస్థలూ ఈ చట్టం పరిధిలోకి వస్తాయి.

వివరాలు 

కమిటీ ఏర్పాటు విధానం 

ఇటీవలి కాలంలో రాజధానిలోని కొన్ని పాఠశాలలు, ఫీజులు చెల్లించని విద్యార్థులను బహిష్కరించడం, అవమానించడం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు మళ్లీ జరగకుండా నియంత్రించేందుకు ముఖ్యమంత్రి రేఖా గుప్తా నేతృత్వంలోని ప్రభుత్వం కఠిన చర్యలకు సిద్ధమైంది. ఈ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత ప్రతి పాఠశాలలో తల్లిదండ్రులు-ఉపాధ్యాయుల కమిటీని తప్పనిసరిగా ఏర్పాటు చేయాలి. ప్రతి సంవత్సరం జూలై 15లోగా 'స్కూల్‌ లెవెల్‌ ఫీ రెగ్యులేషన్‌ కమిటీ' ఏర్పాటు చేయాలి. దీనికి ఛైర్మన్‌గా పాఠశాల యాజమాన్య ప్రతినిధి, సెక్రటరీగా ప్రిన్సిపల్‌ వ్యవహరిస్తారు. సభ్యులుగా అదే పాఠశాలకి చెందిన ముగ్గురు టీచర్లు, పేరెంట్‌-టీచర్‌ అసోసియేషన్‌ నుండి ఐదుగురు తల్లిదండ్రులు లాటరీ విధానంలో ఎంపికవుతారు. విద్యా డైరెక్టర్‌ ప్రతినిధి అబ్జర్వర్‌గా ఉంటారు.

వివరాలు 

ఫీజుల ప్రతిపాదన-ఆమోదం 

కమిటీ ఏర్పాటైన వారం రోజుల్లో సభ్యుల వివరాలను పాఠశాల నోటీస్‌ బోర్డులో,వెబ్‌సైట్‌లో ప్రకటించాలి. ఒక కాపీని విద్యా డైరెక్టర్‌ నియమించిన అధికారికి పంపాలి. సభ్యుల్లో కనీసం ఒకరు ఎస్సీ, ఎస్టీ లేదా సామాజిక,విద్యా పరంగా వెనుకబడిన వర్గానికి చెందినవారు ఉండాలి. మహిళలు ఇద్దరికంటే తక్కువ ఉండరాదు.ఈ కమిటీ పదవీకాలం ఒక విద్యా సంవత్సరం వరకు ఉంటుంది. కమిటీ ఏర్పాటు పూర్తయ్యాక,పాఠశాల యాజమాన్యం వచ్చే మూడేళ్ల ఫీజుల ప్రతిపాదన,సంబంధిత రికార్డులతో జూలై 31లోగా కమిటీకి అందించాలి. కమిటీ ప్రతిపాదనను పరిశీలించి,దానికంటే ఎక్కువ మొత్తాన్ని నిర్ణయించే అధికారం ఉండదు. ప్రతిపాదనపై 30రోజుల్లో ఏకాభిప్రాయంతో ఆమోదం తెలిపి,లిఖిత పూర్వకంగా యాజమాన్యానికి అందించాలి. ఆమోదించిన ఫీజులను యాజమాన్యం నోటీస్‌ బోర్డులు,వెబ్‌సైట్‌లలో ప్రకటించాలి.నిర్ణయించిన ఫీజులు తప్పనిసరిగా మూడేళ్లు అమలులో ఉండాలి.

వివరాలు 

జిల్లా అప్పిలేట్‌ కమిటీ 

కమిటీ సెప్టెంబర్‌ 15లోగా నిర్ణయం తీసుకోకపోతే, పాఠశాల యాజమాన్యం నెలాఖరులోపు జిల్లా ఫీజు అప్పిలేట్‌ కమిటీకి అప్పీల్‌ చేయవచ్చు. నియంత్రణ కమిటీ నిర్ణయంపై అసంతృప్తి ఉన్న తల్లిదండ్రులు కూడా 30 రోజుల్లో జిల్లా అప్పిలేట్‌ కమిటీని ఆశ్రయించవచ్చు. జిల్లా ఎడ్యుకేషన్‌ డిప్యూటీ డైరెక్టర్‌ ఛైర్మన్‌గా, జోనల్‌ ఎడ్యుకేషన్‌ డిప్యూటీ డైరెక్టర్‌ మెంబర్‌ సెక్రటరీగా వ్యవహరిస్తారు. సభ్యులుగా ఒక ఛార్టర్డ్‌ అకౌంటెంట్‌, జిల్లా అకౌంట్స్‌ విభాగ అధికారి, పాఠశాలలు,తల్లిదండ్రుల ప్రతినిధులు ఇద్దరు చొప్పున ఉంటారు. అప్పీల్‌ పై 30 రోజుల్లో నిర్ణయం ఇవ్వాలి. గరిష్టంగా 45 రోజులు మించరాదు. ఆ తర్వాత ఆటోమేటిక్‌గా రివిజన్‌ కమిటీకి వెళ్తుంది.

వివరాలు 

రివిజన్‌ కమిటీ 

విద్యా రంగంలో విశేష సేవలందించిన ప్రముఖుడు ఛైర్మన్‌గా, సభ్యులుగా ఛార్టర్డ్‌ అకౌంటెంట్‌, అకౌంట్స్‌ కంట్రోలర్‌/డిప్యూటీ కంట్రోలర్‌, పాఠశాలలు,తల్లిదండ్రుల ప్రతినిధులు ఒక్కొక్కరు ఉంటారు. అదనపు విద్యా డైరెక్టర్‌ మెంబర్‌ సెక్రటరీగా ఉంటారు. ఈ కమిటీ 45 రోజుల్లో తుది నిర్ణయం ఇస్తుంది. ఈ తీర్పే అంతిమం. ఫీజు నిర్ధారణలో పరిగణించాల్సిన అంశాలు పాఠశాల ఉన్న ప్రదేశం నాణ్యమైన విద్యకు అవసరమైన మౌలిక వసతులు వెబ్‌సైట్‌, ప్రాస్పెక్టస్‌లో పేర్కొన్న సౌకర్యాల అమలు స్థాయి విద్యా ప్రమాణాలు పరిపాలన, నిర్వహణ ఖర్చులు ఎన్‌ఆర్‌ఐలు/ఇతరుల విరాళాలు, ప్రభుత్వ పథకాల ద్వారా నిధులు బోధన, బోధనేతర సిబ్బంది అర్హతలు, వేతనాలు, వార్షిక ఇంక్రిమెంట్లు విద్యార్థులపై చేసే వ్యయాలు, ఆదాయ మిగులు తదితర అంశాలు

వివరాలు 

శిక్షలు, జరిమానాలు

చట్టం ప్రకారం ఫీజు నిర్ణయించని పాఠశాలపై జిల్లా విద్యా అధికారి ఫీజు రద్దు చేయడమే కాకుండా, వసూలు చేసిన అదనపు ఫీజు 20 రోజుల్లో తిరిగి ఇవ్వాలని ఆదేశించగలరు. మొదటి ఉల్లంఘన: రూ.1 లక్ష - రూ.5 లక్షల జరిమానా రెండోసారి లేదా ఆపై ఉల్లంఘన: రూ.2 లక్ష - రూ.10 లక్షల జరిమానా 20 రోజుల్లో ఫీజు తిరిగి చెల్లించకపోతే జరిమానా రెట్టింపు, 40 రోజులు మిస్తే మూడు రెట్లు, 60 రోజులు మిస్తే నాలుగు రెట్లు వసూలు చేస్తారు. పునరావృత ఉల్లంఘనలపై యాజమాన్యంలోని బాధ్యుడిని పదవి నుంచి తొలగించడం, తరువాత ఫీజు పెంపు ప్రతిపాదనలకు అనుమతి ఇవ్వకపోవడం, గుర్తింపు సస్పెండ్‌ చేయడం, చివరికి పాఠశాలను ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకోవడం జరుగుతుంది.

వివరాలు 

రూ.50వేల చొప్పున జరిమానా

ఫీజు చెల్లించలేదని లేదా ఆలస్యం చేశారని విద్యార్థిని వేధించడం,హాజరు పట్టిక నుంచి పేరు తొలగించడం,పరీక్ష ఫలితాలు నిలిపివేయడం,తరగతులు లేదా ఇతర కార్యకలాపాలకు అనుమతించకపోవడం,బహిరంగ అవమానాలు లేదా శారీరక హింస వంటి చర్యలు తీసుకుంటే,ఒక్కో విద్యార్థిపై రూ.50,000 జరిమానా విధించగల అధికారం విద్యా డైరెక్టర్‌కు ఉంటుంది.