Delhi: ఢిల్లీ నగరంలో ఏడాది పొడవునా బాణాసంచా నిషేధం
దిల్లీలో గడచిన కొన్ని సంవత్సరాలుగా తీవ్రమైన వాయు కాలుష్యం ప్రజలను ఇబ్బంది పెడుతోంది. ముఖ్యంగా ఆగస్టు నుండి జనవరి వరకు ఇక్కడ వాయు కాలుష్యం తీవ్రస్థాయిలో ఉంటుంది. చుట్టుపక్కల రాష్ట్రాల్లో పంటనూర్పిడికి తర్వాత పొలాల్లో నిప్పంటించడం దీనికి ప్రధాన కారణం. ఈ పొగతో ఢిల్లీలోని వాయు నాణ్యత మరింత దిగజారుతుంది. దీనికి తోడు ఇక్కడి వాహనాల నుండి విడుదలయ్యే కాలుష్యం సమస్యను మరింత పెంచుతుంది. ఇతర కారణాలు కూడా దీనికి తోడ్పడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఢిల్లీలో చాలా సంవత్సరాలుగా దీపావళి పండుగ సందర్భంగా బాణసంచా కాల్చడాన్ని నిషేధిస్తూ నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాజాగా ఆప్ ప్రభుత్వం ఈ నిషేధాన్ని శాశ్వతంగా అమలు చేయాలని నిర్ణయించింది.
సుప్రీం కోర్టు హెచ్చరిక
ఈ నిర్ణయం నేపథ్యంలో, ఢిల్లీ పర్యావరణ విభాగం అన్ని రకాల బాణసంచా తయారీ, నిల్వ, విక్రయం, ఆన్‌లైన్ డెలివరీలతో పాటు వినియోగంపై నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రత్యేకంగా శీతాకాల కాలుష్యాన్ని దృష్టిలో ఉంచుకుని, వచ్చే ఏడాది జనవరి 1వ తేదీ వరకు ఈ నిషేధం కొనసాగుతుందని ఆప్ ప్రభుత్వం సెప్టెంబరులో ప్రకటించింది. అయినప్పటికీ, దీపావళి తర్వాత కాలుష్యం మరింతగా పెరిగింది. ఈ పరిణామంపై సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ, బాణసంచా నిషేధం అమలులో నిర్లక్ష్యం చేయడంపై ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఈ నేపథ్యంలో ఆప్ ప్రభుత్వం బాణసంచా నిషేధాన్ని శాశ్వతంగా అమలు చేయాలని నిర్ణయించింది.