Delhi Air Pollution: దేశ రాజధాని ఢిల్లీలో పెరిగిన వాయు కాలుష్యం.. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది
దేశ రాజధాని దిల్లీలో వాయు కాలుష్యం పరిస్థితి మరింత దారుణంగా మారుతోంది. శుక్రవారం ఉదయం ఢిల్లీలో కనిష్ట ఉష్ణోగ్రత 11.3 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. ఈ క్రమంలో నగరాన్ని దట్టమైన పొగమంచు చుట్టుముట్టింది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ) 373గా నమోదైందని అధికారులు తెలిపారు. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి వివరాల ప్రకారం, ఢిల్లీలోని 38 మానిటరింగ్ స్టేషన్లలో తొమ్మిదిలో ఏక్యూఐ స్థాయిలు తీవ్రమైన స్థాయిలో ఉన్నాయి. ఆనంద్ విహార్, బవానా, జహంగీర్‌పురి, ముండ్కా, నెహ్రూ నగర్, షాదీపూర్, సోనియా విహార్, వివేక్ విహార్, వజీర్‌పూర్ వంటి ప్రాంతాల్లో గాలి నాణ్యత అత్యంత దారుణంగా ఉందని అధికారులు వెల్లడించారు.
తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో ప్రజలు
ఈ ప్రాంతాల్లో ఏక్యూఐ స్థాయిలు 400 కంటే ఎక్కువగా నమోదు కావడం గమనార్హం. దీని వల్ల ప్రజలు తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారని చెప్పారు. ఉదయం 8:30 గంటలకు ఢిల్లీలో తేమ స్థాయి 97 శాతంగా ఉండగా, రోజంతా మోస్తరు పొగమంచు కొనసాగుతుందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) అంచనా వేసింది. గరిష్ట ఉష్ణోగ్రతలు 27 డిగ్రీల సెల్సియస్‌గా నమోదు అయ్యే అవకాశం ఉందని తెలిపారు.