Delhi: 128 రోజుల పాటు స్వచ్ఛమైన గాలిని పీల్చిన ఢిల్లీ వాసులు.. నివేదిక
ఈ ఏడాది ప్రథమార్థంలో దిల్లీ ప్రజలు మొత్తం 128 రోజుల పాటు స్వచ్ఛమైన గాలి పీల్చారని ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ప్రభుత్వం ప్రకటించిన నివేదిక తెలియజేస్తోంది. ఢిల్లీ కాలుష్య నియంత్రణ కమిటీ (DPCC) సమర్పించిన ఈ నివేదిక 2024 జనవరి నుండి జూలై వరకు ఢిల్లీలో గాలి నాణ్యతను ట్రాక్ చేసింది. నివేదిక ప్రకారం,ఈ కాలంలో 128 రోజులు గాలి స్వచ్ఛంగా ఉండగా, ఆగస్టు 1 నుండి ఆగస్టు 20 వరకు మరో 20 రోజులు గాలి నాణ్యత స్వచ్ఛంగా ఉందని పేర్కొంది. గాలి నాణ్యత సంతృప్తికర స్థాయిలో 159 రోజులు ఉండగా, 2023లో ఈ సంఖ్య 206 రోజులకు చేరింది.
కాలుష్యాన్ని తగ్గించేందుకు ఢిల్లీ ప్రభుత్వం చేపట్టిన చర్యలు
కాగా, వాహనాల ఉద్గారాలు,పారిశ్రామిక ధూమ్రాలు,బహిరంగ దహనం వంటి వాయు కాలుష్యానికి ప్రధాన కారణాలని నివేదిక గుర్తించింది. ఈ కాలుష్యాన్ని తగ్గించేందుకు ఢిల్లీ ప్రభుత్వం చేపట్టిన చర్యలను కూడా నివేదికలో ప్రస్తావించారు. రవాణా శాఖ,ట్రాఫిక్ పోలీసులతో కలిసి 385ప్రత్యేక ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాలను ఏర్పాటు చేసి, జనవరి 1 నుండి జూలై 15 వరకు 308కాలుష్యకార వాహనాలను సీజ్ చేశారు. త్వరలో,ఢిల్లీ ప్రభుత్వం 3,267ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తోందని నివేదిక తెలిపింది. అక్టోబర్ 2023 నుండి జూలై 2024 వరకు బహిరంగంగా బయోమాస్ కాల్చకుండా నిరోధించేందుకు 338 పెట్రోలింగ్ బృందాలను కూడా ఏర్పాటు చేశారు. ఈ బృందాలు 65,000స్థలాలలో తనిఖీలు జరిపి,550చలాన్లు జారీ చేయడంతో పాటు రూ.6.85లక్షల జరిమానా వసూలు చేశాయని నివేదిక వెల్లడించింది.