మనీష్ సిసోడియాను తలుచుకొని అరవింద్ కేజ్రీవాల్ కంటతడి
దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బుధవారం నగరంలో కొత్త పాఠశాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా జైలు శిక్ష అనుభవిస్తున్న తన సహోద్యోగి, మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను మిస్ అవుతున్నానని కేజ్రీవాల్ కన్నీళ్లు పెట్టుకున్నారు. దిల్లీ మద్యం కుంభకోణం కేసులో సిసోడియా ఫిబ్రవరి నుంచి జైలులో ఉన్నారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడారు. నేడు మనీష్ సిసోడియాను చాలా మిస్సవుతున్నాని పేర్కొన్నారు. ఈ పాఠశాలకు ఆయన శంకుస్థాపన చేశారని, ప్రతి చిన్నారికి అత్యుత్తమ విద్య అందించాలన్నదే సిసోడియా కల అన్నారు.
సత్యం ఎప్పటికీ ఓడిపోదు: కేజ్రీవాల్
భారతీయ జనతా పార్టీపై ఈ సందర్భంగా కేజ్రీవాల్ పరోక్ష విమర్శలు చేశారు. దిల్లీ ప్రభుత్వం విద్యారంగంలో తీసుకొస్తున్న మార్పులను అడ్డుకోవాలని కొందరు చూస్తున్నారని మండిపడ్డారు. కానీ తాము కొనసాగించి తీరుతామని స్పష్టం చేశారు. వారు తప్పుడు ఆరోపణలతో తప్పుడు కేసులు పెట్టారని, మంచి వ్యక్తిని జైలులో ఉంచారని కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. సిసోడియాను ఎందుకు జైలులో పెట్టారు? దేశంలో చాలా మంది దొంగలు స్వేచ్ఛగా తిరుగుతున్నారని, మనీష్ సిసోడియా మంచి విద్యను అందించకపోతే, మంచి పాఠశాలలను నిర్మించడంలో సహాయం చేయకపోతే, అతన్ని జైలుకు పంపేవారు కాదా అని ప్రశ్నించారు. సిసోడియా త్వరలో విడుదల అవుతాడని తనకు పూర్తి నమ్మకం ఉందని, సత్యం ఎప్పటికీ ఓడిపోదని చెప్పారు.