MLC Kavitha: కవితకు షాక్.. సీబీఐ కస్టడీకి కోర్టు అనుమతి
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన కేసులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మరో షాక్ తగిలింది. సీబీఐ అభ్యర్థన మేరకు రూస్ అవెన్యూ కోర్టు ఈనెల 15 ఉదయం గం.10.00 వరకు కవితకు సీబీఐ కస్టడీకి అనుమతి ఇస్తూ కోర్టు తీర్పు వెలువరించింది. అంతేకాకుండా, కవితను సీబీఐ కస్టడీలో కలిసేందుకు కేటీఆర్,సంతోష్,భర్త అనిల్,కవిత పిల్లలు, తల్లి,పీఏ కలిసేందుకు అనుమతిని కూడా కోర్టు ఇచ్చింది. సాయంత్రం 6గంటల నుంచి 7గంటల వరకు కలిసేందుకు అనుమతి ఇచ్చినట్లు తెలిసింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో మనీలాండరింగ్ కేసులో కవితను సీబీఐ అరెస్ట్ చేసింది. నేరపూరిత కుట్ర, ఖాతాలను తారుమారు చేయడంతోపాటు అవినీతి నిరోధక చట్టంలోని కొన్ని సెక్షన్ల కింద కవితను సీబీఐ అదుపులోకి తీసుకుంది.
లిక్కర్ పాలసీ కేసులో కవిత కీలక పాత్రధారి, సూత్రధారి
5 రోజుల రిమాండ్ ఇవ్వాలని సిబిఐ కోర్టును కోరగా .. కోర్టు మూడు రోజుల కస్టడీ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కోర్టులో విచారణ సందర్భంగా సీబీఐ న్యాయవాది మాట్లాడుతూ.. లిక్కర్ పాలసీ కేసులో కవిత కీలక పాత్రధారి, సూత్రధారిగా తెలిపారు. ఆమ్ ఆద్మీ పార్టీకి రూ.100 కోట్ల లంచం అందజేయడంలో కవిత పెద్ద పాత్ర పోషించారని అన్నారు. ఆమె ప్రధాన కుట్రదారులలో ఒకరిని.. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను ఒక బడా వ్యాపారవేత్త కలవగా, ఎక్సైజ్ పాలసీ ద్వారా మద్దతు ఇస్తామని సీఎం హామీ ఇచ్చారు. ఈ కేసుకు సంబంధించి పలువురు నిందితుల వాంగ్మూలాలను నమోదు చేశారు. హోటల్ తాజ్‌లో సమావేశం జరిగిందని లాయర్ తెలిపారు.
డబ్బు సమకూర్చడంలో కవిత పాత్ర సూత్రధారి: సీబీఐ
కవిత హైదరాబాద్‌లో వ్యాపారవేత్తను కలిశారని సిబిఐ తెలిపింది. విజయ్ నాయర్ కవితతో టచ్ లో ఉన్నారు. 100 కోట్లు అడ్వాన్స్‌గా ఇచ్చేందుకు ఏర్పాట్లు చేయాలని బీఆర్‌ఎస్ నాయకురాలు వ్యాపారవేత్తను కోరారు. ఈ డబ్బును సమకూర్చడంలో కవిత పాత్ర చాలా పెద్దది. గోవా ఎన్నికల కోసం హవాలా ద్వారా డబ్బు వసూలు చేసినట్లు సీబీఐ పేర్కొంది. వాట్సాప్ సంభాషణలు కూడా ఈ విషయాలను ధృవీకరిస్తున్నాయని దర్యాప్తు సంస్థలు పేర్కొన్నాయి. ఇక ఆప్ నేతలకు సౌత్ గ్రూప్ ద్వారా రూ.100 ముడుపులు ఇచ్చినట్లుగా గుర్తించారు. కవిత సూచన మేరకు మాగుంట శ్రీనివాసులురెడ్డి రూ. 25 కోట్లు అందజేశారు. ఈ విషయాన్ని ఆయన తన వాంగ్మూలంలో వెల్లడించారు. ఇందుకు సంబంధించిన ఆధారాలను కూడా సీబీఐ కోర్టుకు సమర్పించింది.