LOADING...
Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసు: కేజ్రీవాల్ సహా 22 మందికి హైకోర్టులో తాత్కాలిక ఊరట..
మద్యం పాలసీ కేసులో కేజ్రీవాల్‌కు ఊరట.. ఏప్రిల్ 6కు విచారణ వాయిదా

Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసు: కేజ్రీవాల్ సహా 22 మందికి హైకోర్టులో తాత్కాలిక ఊరట..

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 16, 2026
03:58 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఢిల్లీ మద్యం పాలసీ కేసులో మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌తో పాటు మరో 22 మందికి ఢిల్లీ హైకోర్టులో సోమవారం తాత్కాలిక ఉపశమనం లభించింది. ఈ కేసులో వారిని నిర్దోషులుగా విడుదల చేస్తూ ట్రయల్ కోర్టు ఇచ్చిన డిశ్చార్జ్ ఉత్తర్వులను సవాలు చేస్తూ సీబీఐ దాఖలు చేసిన పిటిషన్‌పై సమాధానం ఇవ్వడానికి హైకోర్టు ఏప్రిల్ 5 వరకు గడువు ఇచ్చింది. ఈ వ్యవహారంలో తదుపరి విచారణను ఏప్రిల్ 6కు వాయిదా వేస్తూ జస్టిస్ స్వర్ణ కాంత శర్మ ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది.

వివరాలు 

'ఆ ఉత్తర్వు ఒక్క నిమిషం కూడా నిలవకూడదు'.. సీబీఐ తీవ్ర అభ్యంతరం

విచారణ సందర్భంగా సీబీఐ తరఫున హాజరైన సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ట్రయల్ కోర్టు ఇచ్చిన డిశ్చార్జ్ తీర్పుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. నిందితులను విడుదల చేస్తూ ఇచ్చిన ఆ ఉత్తర్వు పూర్తిగా విరుద్ధంగా ఉందని ఆయన కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇలాంటి తప్పు తీర్పు రికార్డులో ఒక్క నిమిషం కూడా ఉండకూడదని,అందువల్ల సీబీఐ అప్పీల్‌ను అత్యవసరంగా విచారించాల్సిన అవసరం ఉందని ఆయన విన్నవించారు. ఈ కేసులో నిందితుల తరఫు న్యాయవాదులు సమాధానం దాఖలు చేయడానికి నాలుగు వారాల గడువు కోరగా, దానికి తుషార్ మెహతా గట్టిగా వ్యతిరేకించారు. కొందరు కావాలనే ఆరోపణలు చేస్తూ విచారణను ఆలస్యం చేసే ప్రయత్నం చేస్తున్నారని,అలాంటి ధోరణికి ప్రోత్సాహం ఇవ్వకూడదని చెప్పారు.

వివరాలు 

సుప్రీంకోర్టు తలుపుతట్టిన కేజ్రీవాల్ వర్గం

ఒక వారం కంటే ఎక్కువ గడువు ఇవ్వకూడదని కోర్టును కోరారు. కేజ్రీవాల్ తరఫున హాజరైన న్యాయవాది ఎన్. హరిహరన్, ఈ కేసులో తాము ఇప్పటికే సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్‌తో పాటు స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసినట్లు హైకోర్టుకు తెలిపారు. ఈ కేసును మరో బెంచ్‌కు బదిలీ చేయాలన్న తమ అభ్యర్థనను హైకోర్టు చీఫ్ జస్టిస్ తిరస్కరించిన తర్వాతే సుప్రీంకోర్టును ఆశ్రయించినట్లు వివరించారు. అయితే, సుప్రీంకోర్టు నుంచి ఎలాంటి స్టే ఉత్తర్వులు వచ్చే వరకు చట్ట ప్రకారం హైకోర్టు విచారణ కొనసాగుతుందని ధర్మాసనం స్పష్టం చేసింది.

Advertisement

వివరాలు 

కేసు నేపథ్యం ఇదే..

ఈ కేసులో ఫిబ్రవరి 27న రౌస్ అవెన్యూ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి జితేంద్ర సింగ్ కీలక తీర్పు ఇచ్చారు. అరవింద్ కేజ్రీవాల్‌తో పాటు మనీష్ సిసోడియా తదితరులను డిశ్చార్జ్ చేస్తూ ఆయన ఉత్తర్వులు జారీ చేశారు. సీబీఐ సమర్పించిన ఆధారాలు కనీసం ప్రాథమికంగా కూడా కేసును నిలబెట్టే స్థాయిలో లేవని కోర్టు వ్యాఖ్యానించింది. అంతేకాదు,సరైన ఆధారాలు లేకుండానే చార్జ్ షీట్ దాఖలు చేసిన దర్యాప్తు అధికారి పై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని కూడా ట్రయల్ కోర్టు ఆదేశించింది. ఈ తీర్పును సవాలు చేస్తూ సీబీఐ హైకోర్టును ఆశ్రయించింది. తమ వద్ద వాట్సాప్ చాట్లు, ఈమెయిల్స్ వంటి బలమైన ఆధారాలు ఉన్నప్పటికీ ట్రయల్ కోర్టు వాటిని పరిగణనలోకి తీసుకోకుండా తీర్పు ఇచ్చిందని సీబీఐ వాదిస్తోంది.

Advertisement