
Delhi HC on PM Modi Degree: మోదీ డిగ్రీ వ్యవహారం.. 'సీఐసీ' ఆదేశాలను కొట్టేసిన ఢిల్లీ హైకోర్టు
ఈ వార్తాకథనం ఏంటి
ప్రధాని నరేంద్ర మోదీ డిగ్రీ సంబంధిత వివరాలను వెల్లడించమని కేంద్ర సమాచార కమిషన్ (CIC) గతంలో జారీ చేసిన ఆదేశాలను దిల్లీ హైకోర్ట్ రద్దు చేసింది. ఫిబ్రవరి 27న రిజర్వ్ చేయబడిన తీర్పును జస్టిస్ సచిన్ దత్తా ఈ రోజు అధికారికంగా విడుదల చేశారు. నీరజ్ అనే వ్యక్తి, ప్రధాని మోదీ డిగ్రీ వివరాలను తెలుసుకోవడానికి,సమాచార హక్కు చట్టం (RTI) ప్రకారం CICలో దరఖాస్తు చేశారు. ప్రధాని మోదీ 1978లో బ్యాచిలర్స్ ఆఫ్ ఆర్ట్స్ (BA) పూర్తి చేసినట్లు రికార్డులు ఉన్నాయి. CIC,ఆ ఏడాది BA పరీక్షల్లో ఉత్తీర్ణులైనవారి వివరాలను తనిఖీ చేయడానికి 2016 డిసెంబరులో అనుమతించింది. అయితే,దిల్లీ విశ్వవిద్యాలయం (DU) దీన్ని సవాలు చేయగా, 2017 జనవరిలో హైకోర్ట్ స్టే ఇచ్చింది.
వివరాలు
సీఐసీ ఉత్తర్వును కొట్టివేయాలన్న సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా
తెలుసుకునే హక్కు కన్నా వ్యక్తిగత గోప్యతా పరిరక్షణ హక్కు మిన్న కాబట్టి.. సీఐసీ ఉత్తర్వును కొట్టివేయాలని దిల్లీ విశ్వవిద్యాలయం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదించారు. ప్రధాని మోదీ డిగ్రీ వివరాలను కోర్టుకు అందించడానికి యూనివర్సిటీ సిద్ధంగా ఉన్నప్పటికీ, ఆర్టీఐ కింద ఎటువంటి అపరిచితులతో ఈ వివరాలను పంచుకోవడానికి సిద్ధంగా లేరని వారు పేర్కొన్నారు. దిల్లీ విశ్వవిద్యాలయం (DU) ప్రకారం, వారు విద్యార్థుల రికార్డుల రక్షణాధికారులు కాబట్టి, ఇతరుల జిజ్ఞాసను తీర్చడానికి ఆ రికార్డులను RTI కింద బయటపెట్టాల్సిన అవసరం లేదు.