Farmers protest: దిల్లీలో ఆందోళనకు పిలుపునిచ్చిన రైతు సంఘాలు.. హర్యానా, హస్తిన పోలీసుల అలర్ట్
కనీస మద్దతు ధర (MSP)తో పాటు రైతుల సమస్యలు పరిష్కరించాలని పంజాబ్, హర్యానాలోని 200 రైతు సంఘాలు ఫిబ్రవరి 13న 'దిల్లీ చలో'కి పిలుపునిచ్చాయి. దీంతో హర్యానా, దిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు. గురుగ్రామ్-దిల్లీ, గురుగ్రామ్-ఝజ్జర్, గురుగ్రామ్-రేవారీ సరిహద్దుల వద్ద భారీ భద్రతను కట్టుదిట్టం చేశారు. అవసరమైతే బారికేడింగ్‌తో పాటు ఇతర ఏర్పాట్లు చేస్తామని పోలీసులు తెలిపారు. రైతులను రాజధానిలోకి రాకుండా అడ్డుకునేందుకు ఢిల్లీ పోలీసులు సన్నాహాలు ప్రారంభించారు. తిక్రీ సరిహద్దులో పోలీసులు భారీ కాంక్రీట్ బారికేడ్లు, కంటైనర్లను ఏర్పాటు చేశారు. రైతుల ఉద్యమాన్ని దృష్టిలో ఉంచుకుని పోలీసులు ఈశాన్య దిల్లీలో 144 సెక్షన్ విధించారు.
దిల్లీ సరిహద్దుల్లో ప్రజలు గుమిగూడడంపై పోలీసుల నిషేధం
రైతు సంఘాలు తమ మద్దతుదారులతో కలిసి దిల్లీలో కవాతు నిర్వహించనున్నట్లు ప్రకటించినట్లు ఈశాన్య దిల్లీ డిప్యూటీ పోలీస్ కమిషనర్ డా. జాయ్ టిర్కీ తెలిపారు. హర్యానా, పంజాబ్, యూపీ, రాజస్థాన్, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్ నుంచి రైతులు ట్రాక్టర్-ట్రాలీల సాయంతో దిల్లీకి రావొచ్చని తెలిపారు. రైతుల ఆందోళన నేపథ్యంలో ఈశాన్య దిల్లీలో 144 సెక్షన్ విధించినట్ల వెల్లడించారు. దిల్లీ సరిహద్దుల్లో సాధారణ ప్రజలు గుమిగూడడంపై పోలీసులు నిషేధం విధించారు. అలాగే, ట్రాక్టర్-ట్రాలీలు, బస్సులు, ట్రక్కులు, ప్రైవేట్ వాహనాలు, వాణిజ్య వాహనాలు, గుర్రాలపై దిల్లీకి వచ్చే వ్యక్తుల ప్రవేశాన్ని ఉత్తరప్రదేశ్ నిషేధించింది.