దిల్లీ లిక్కర్ కేసులో నేడు హైకోర్టు విచారణ..ఎంపీ సంజయ్ సింగ్ పిటిషన్ దాఖలు
దిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తనను అరెస్ట్ చేయడంపై ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు సంజయ్ దాఖలు చేసిన పిటిషన్ ను విచారించేందుకు దిల్లీ ఉన్నత న్యాయస్థానం అంగీకారం తెలిపింది. తనను ఈడీ రిమాండ్ చేయడాన్ని సవాల్ చేస్తూ ఆమ్ ఆద్మీ ఎంపీ సంజయ్ సింగ్ హైకోర్టు మెట్లు ఎక్కారు. ఈ మేరకు దిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సతీష్ చంద్ర శర్మ, జస్టిస్ సంజీవ్ నరుల ధర్మాసనం ముందు సింగ్ పిటిషన్ విచారణకు రానుంది. మరోవైపు తన క్లయింట్‌ను అరెస్ట్ చేసేందుకు ఈడీ ఎటువంటి ఆధారాలు అందించలేదని సంజయ్ తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.ఈ క్రమంలోనే ఇవాళ హైకోర్టు విచారణ చేపట్టనుంది.
సంజయ్ సింగ్ కీలక పాత్రగా ఈడీ అభియోగాలు
దిల్లీ ఎక్సైజ్ పాలసీ 2021-22ని రూపొందించడంలో, అమలు చేయడంలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై సంజయ్ సింగ్ పై ఈడీ మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది. విచారణలో భాగంగా అక్టోబర్ 4న సింగ్‌ను ఈడీ అరెస్ట్ చేసింది. అయితే మద్యం పాలసీని రూపొందించి, అమలు చేయడంలో ఎంపీ సంజయ్ సింగ్ కీలక పాత్ర పోషించారని ఈడీ తన ఛార్జ్ షీట్‌లో పేర్కొంది. ఈ విధానం మద్యం తయారీదారులు, టోకు వ్యాపారులు, రిటైలర్లకు అనుకూలంగా ఉందని దర్యాప్తు సంస్థ నిర్థారణకు వచ్చింది. మరోవైపు ఈడీ నమోదు చేసిన అభియోగాలు తప్పుడు ఆరోపణలని, అవి నిరాధారమైనవని సింగ్ ఖండించారు. గత మంగళవారం ప్రత్యేక కోర్టు సింగ్‌కు ఈడీ కస్టడీని అక్టోబర్ 13 వరకు పొడిగించింది.