దిల్లీ మద్యం కుంభకోణం: అరెస్టుపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన మనీష్ సిసోడియా
ఈ వార్తాకథనం ఏంటి
లిక్కర్ పాలసీ కేసులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) తనను అరెస్టు చేయడాన్ని సవాల్ చేస్తూ దిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా మంగళవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
సిసోడియా అరెస్టును, మద్యం పాలసీ కేసులో సీబీఐ దర్యాప్తు తీరును సవాల్ చేస్తూ సీజేఐ ఎదుట సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ కేసును ప్రస్తావించారు.
ఈ మేరకు పిటిషన్‌ను విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. ఈరోజు(మంగళవారం) మధ్యాహ్నం 3.50 గంటలకు భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) విచారణ జరపనున్నారు.
దిల్లీ
5రోజుల పాటు సీబీఐ కస్టడీలో మనీష్ సిసోడియా
మనీష్ సిసోడియాను సీబీఐ ఆదివారం అరెస్టు చేసింది. సోమవారం కోర్టులో హాజరు పర్చగా, 5రోజుల సీబీఐ కస్టడీకి కోర్టు అంగీకరించింది.
మద్యం పాలసీ కేసులో మనీష్ సిసోడియాపై ఐపీసీ 120బీ, 477ఏ (మోసం చేయాలనే ఉద్దేశం), అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 7 కింద అరెస్టు చేశారు.
దిల్లీలో కొత్త ఎక్సైజ్ పాలసీ రూపకల్పన, అమలులో జరిగిన అవకతవకలు, అవినీతికి సంబంధించి ఆరోపణలపై విచారించేందుకు సిసోడియాను సీబీఐ ఆదివారం పిలిచింది. దాదాపు ఎనిమిది గంటల పాటు విచారించిన తర్వాత అతని సమాధానాలు సంతృప్తికరంగా లేవని అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు.