LOADING...
AAP:కేజ్రీవాల్‌ 'ఆపరేషన్ లోటస్' ఆరోపణలపై దర్యాప్తునకు ఎల్ జీ ఆదేశం
కేజ్రీవాల్‌ 'ఆపరేషన్ లోటస్' ఆరోపణలపై దర్యాప్తునకు ఎల్ జీ ఆదేశం

AAP:కేజ్రీవాల్‌ 'ఆపరేషన్ లోటస్' ఆరోపణలపై దర్యాప్తునకు ఎల్ జీ ఆదేశం

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 07, 2025
02:24 pm

ఈ వార్తాకథనం ఏంటి

అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు ముందు దేశ రాజధాని దిల్లీలో రాజకీయ వేడి మరింత పెరిగింది. బీజేపీ 'ఆపరేషన్‌ లోటస్‌'కు కుట్రలు పన్నుతోందని ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ సంచలన ఆరోపణలు చేశారు. దీనిపై బీజేపీ తీవ్రంగా స్పందించగా, లెఫ్టినెంట్‌ గవర్నర్‌ ఈ ఆరోపణలపై విచారణకు ఆదేశించారు.

వివరాలు 

బీజేపీపై ఆప్‌ ఆరోపణలు 

బీజేపీ తమ అభ్యర్థులను తమ వైపు లాక్కోవడానికి ప్రయత్నిస్తోందని కేజ్రీవాల్‌ ఆరోపించారు. కొన్ని ఎమ్మెల్యే అభ్యర్థులకు ఫోన్‌ కాల్స్‌ చేసి ఒక్కొక్కరికి రూ.15 కోట్లు ఆఫర్‌ చేసినట్టు తెలిపారు. అంతేకాకుండా, తప్పుడు ఎగ్జిట్‌ పోల్స్‌ సర్వేలు నిర్వహించి ఆప్‌ నేతలను భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. అయితే, బీజేపీ ఎన్ని ప్రయత్నాలు చేసినా తమ పార్టీ నేతలు మోసపోరని స్పష్టం చేశారు. బీజేపీ ఓటమి భయంతోనే తమ పార్టీ అభ్యర్థులను ఆకర్షించడానికి శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తోందని ఆప్‌ సీనియర్‌ నేత సంజయ్‌ సింగ్‌ ఆరోపించారు.

వివరాలు 

బీజేపీ స్పందన 

ఆప్‌ చేస్తున్న ఆరోపణలు నిరాధారమని బీజేపీ కొట్టిపారేసింది. బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందనే భయంతోనే ఆప్‌ నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారని దిల్లీ బీజేపీ చీఫ్‌ విరేంద్ర సచ్‌దేవా పేర్కొన్నారు. బీజేపీ కార్యదర్శి విష్ణు మిట్టల్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌కు లేఖ రాయగా, ఆప్‌ నేతల ఆరోపణలను ఏసీబీ ద్వారా విచారించాలని, తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. దాంతో, లెఫ్టినెంట్‌ గవర్నర్‌ విచారణకు ఆదేశాలు జారీ చేయగా, ఏసీబీ అధికారులు కేజ్రీవాల్‌, సంజయ్‌ సింగ్‌ నివాసాలకు చేరుకున్నారు.

వివరాలు 

కేజ్రీవాల్‌ నివాసానికి ఆప్‌ అభ్యర్థులు 

ఈ పరిణామాల మధ్య ఆప్‌ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులు అరవింద్‌ కేజ్రీవాల్‌ నివాసానికి వెళ్లి ఆయనతో సమావేశమయ్యారు. 70 మంది అభ్యర్థులు, ముఖ్యమంత్రి ఆతిశీ, సీనియర్‌ నేతలు మనీష్‌ సిసోడియా, సంజయ్‌ సింగ్‌, ఇమ్రాన్‌ హుస్సేన్‌ కేజ్రీవాల్‌తో సమావేశమయ్యారు. ఫిబ్రవరి 5న దిల్లీ శాసనసభ ఎన్నికల పోలింగ్‌ జరిగింది. సాయంత్రం 5 గంటల వరకు 57.70% ఓటింగ్‌ నమోదైనట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. బీజేపీ-ఆప్‌ల మధ్య హోరాహోరీ పోటీ నెలకొనగా, ఎగ్జిట్‌ పోల్స్‌ బీజేపీ విజయానికే సూచిస్తున్నాయి. ఫిబ్రవరి 8న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.