POLLUTION : దిల్లీలో డేంజర్ బెల్స్.. వాయుకాలుష్యంతో ఆస్పత్రి బాటలో దిల్లీ వాసులు
దిల్లీలో గత కొద్ది రోజులుగా తీవ్ర వాయు కాలుష్యం దేశ రాజధాని వాసులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.ఈ క్రమంలోనే అక్టోబరు 25న వరుసగా మూడో రోజు దిల్లీలో గాలి నాణ్యత తీవ్రంగా పతనమైంది. ఈ మేరకు Air Quality Indexలో ఫేలవమైన(Poor) కేటగిరీలో కొనసాగుతోంది. రానున్న రోజుల్లో కాలుష్యం మరింత పెరిగితే దిల్లీ పరిస్థితి ఏంటని వాతావరణ నిపుణులు, ప్రభుత్వాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. శీతాకాలం నేపథ్యంలో ఇప్పుటికిప్పుడు మెరుగుదల కనిపించకపోవచ్చని పర్యవేక్షణ సంస్థలు అంచనా వేస్తున్నాయి. తాజా దుస్థితి కారణంగా పిల్లలు, మహిళలు, వృద్ధులు, అస్తమా బాధితులు అధిక కాలుష్యం ఉన్న సమయంలో బయటి కార్యకలాపాలకు దూరంగా ఉండాలని వైద్యనిపుణులు సూచిస్తున్నారు.ఈ మేరకు నాణ్యత గల మాస్కులు ధరిస్తూ అదనపు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
వాయు కాలుష్యంతో దిల్లీ ఆస్పత్రులు కిటకిట
వాయు కాలుష్యంతో దిల్లీ వాసుల్లో ఉబ్బసం(అస్తమా), COPD పెట్రేగిపోతున్నాయని వైద్యులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు రోగుల్లో భయంకరమైన పెరుగుదలను చూస్తున్నామని దిల్లీకి చెందిన ధర్మశిల నారాయణ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలోని పల్మోనాలజీ విభాగం వైద్యులు అన్నారు. గత 15 రోజుల్లో సుమారు 15 శాతం కేసులు పెరిగాయన్నారు. మరోవైపు హోలీ ఫ్యామిలీ ఆస్పత్రిలో ఇప్పటికే ఇన్‌స్టిట్యూట్, ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో రోగులు చేరుతున్నారని పేర్కొన్నారు. ఆస్తమా, COPD, ILD (ఇంటర్‌స్టీషియల్ ఊపిరితిత్తుల వ్యాధి) వంటి శ్వాసకోశ వ్యాధుల తీవ్రతకు సంబంధించిన రోగులు ఆస్పత్రిలో చేరారన్నారు. మరోవైపు రోగులు వెంటనే మందులకు స్పందించడం లేదని, దీనికి వాయు కాలుష్యమే ప్రధాన కారణమని ఫరీదాబాద్‌లోని NCRలోని అమృతా ఆస్పత్రి వైద్యులు చెబుతున్నారు.