జీ20 సదస్సు వేళ.. దిల్లీలో పోలీసుల 'కార్కేడ్ రిహార్సల్'.. ఈ మార్గాల్లో ఆంక్షల విధింపు
G20 శిఖరాగ్ర సమావేశాలను పురస్కరించుకుని దిల్లీ పోలీసులు 'కార్కేడ్ రిహార్సల్' నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే శనివారం, ఆదివారం పలు రూట్లలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఈ మేరకు ప్రజలు ప్రత్యాహ్నాయ మార్గాల్లో ప్రయాణించాలని దిల్లీ స్పెషల్ పోలీస్ కమిషనర్ యాదవ్ సూచించారు. సర్దార్ పటేల్ మార్గ్, పంచశీల్ మార్గ్, 11 మూర్తి, తీన్ మూర్తి రౌండ్ అబౌట్, బరాఖంబ రోడ్, జన్‌పథ్, కర్తవ్య పాత్, వివేకానంద్ మార్గ్, లోధి రోడ్ ఫ్లైఓవర్ , జోసెఫ్ టిటో మార్గ్, తదితర ప్రదేశాల్లో ఆంక్షలున్నట్లు ఆయన తెలిపారు. ప్రెస్ ఎన్‌క్లేవ్ రోడ్, లాల్ బహదూర్ శాస్త్రి మార్గ్, సి-హెక్సాగన్, మధుర రోడ్, సలీమ్ ఘర్ బైపాస్ లాంటి అధిక రద్దీ ట్రాఫిక్ ప్రాంతాల్లో ఆంక్షలు విధించామన్నారు.
సోషల్ మీడియా వేదికగా సందేహాలకు నివృత్తి
మరోవైపు సామాజిక మాధ్యమాల ద్వారా ట్రాఫిక్ ఆంక్షలపై సందేహాలకు ట్రాఫిక్ పోలీసులు జవాబులిస్తున్నారు. సందేహాలుంటే https://traffic.delhipolice.gov.in/dtpg20info/, వెబ్‌సైట్ ద్వారా నివృత్తి చేసుకోవచ్చు. mappls.com/getAppను ద్వారా కూడా సమాచారం తెలుసుకోవచ్చని దిల్లీ ట్రాఫిక్ పోలీసులు స్పష్టం చేశారు. సెప్టెంబర్ 2, శనివారం సాయంత్రం 4.30 నుంచి 6 గంటల వరకు, అలాగే రాత్రి 7 నుంచి రాత్రి 11 గంటల వరకు మాక్ డ్రిల్స్ నిర్వహించనున్నట్లు ట్రాఫిక్ పోలీసులు చెప్పారు. ఆదివారం ఉదయం 8 గంటల నుంచి 9 గంటల వరకు, 9:30 నుంచి 10:30 గంటల వరకు, మధ్యాహ్నం 12:30 నుంచి సాయంత్రం 4 గంటల వరకు రిహార్సల్ ప్రక్రియ ఉంటుందన్నారు.