Delhi Pollution: పాఠశాలల మూసివేతపై నవంబర్ 6న నిర్ణయం
దేశ రాజధానిలో వాయు కాలుష్య స్థాయిలు పెరుగుతున్ననేపథ్యంలో, దిల్లీలోని అన్ని పాఠశాలలను రాబోయే రెండు రోజుల పాటు మూసివేస్తున్నట్లు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గురువారం ప్రకటించారు. పెరుగుతున్న వాయు కాలుష్య స్థాయిలను పరిష్కరించడానికి, GRAP-3 (గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్) చర్యలను పటిష్టంగా అమలు చేయడానికి సంబంధిత ప్రభుత్వ శాఖలతో ఢిల్లీ పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్ అధ్యక్షతన సమగ్ర సమీక్ష సమావేశం జరిగింది . ఈ సందర్భంగా గోపాల్ రాయ్ మాట్లాడుతూ ఢిల్లీలోని పాఠశాలల మూసివేతపై నవంబర్ 6న గాలి నాణ్యత ఆధారంగా నిర్ణయం తీసుకుంటామన్నారు.
తీవ్ర వాయు కాలుష్యంతో దిల్లీ
మేము బేసి-సరి స్కీమ్‌ను ఆలస్యం చేయడం లేదన్న ఆయన, సుప్రీం కోర్ట్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ కమిషన్ (CAQM) నిర్ణయం తీసుకోవడానికి ఆదేశాన్ని ఇచ్చిందన్నారు. వారి ఆదేశాల ప్రకారం, తాము అడుగులు వేస్తున్నామన్నారు. పరిస్థితి చాలా తీవ్రంగా మారితే, అందరితో చర్చించిన తర్వాత తదుపరి నిర్ణయాలు తీసుకుంటామని గోపాల్ రాయ్ తెలిపారు. దేశ రాజధాని, దాని చుట్టుపక్కల ప్రాంతాలు తీవ్రమైన వాయు కాలుష్యంతో పోరాడుతున్నందున ఢిల్లీ ప్రజలు శుక్రవారం ఎడతెగని సమస్యను ఎదుర్కొంటున్నారు. దిల్లీ ప్రభుత్వం శుక్రవారం,శనివారాలు అన్ని ప్రాథమిక పాఠశాలలను మూసివేసింది. ఢిల్లీ, గురుగ్రామ్, ఫరీదాబాద్, ఘజియాబాద్, గౌతమ్ బుద్ధ్ నగర్‌లలో అనవసరమైన నిర్మాణ కార్యకలాపాలపై నిషేధం అమలు చేసింది. BS-3 పెట్రోల్, BS-4 డీజిల్ వాహనాల నిర్వహణపై పరిమితి విధించింది.
గత కొన్ని రోజులుగా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ తీవ్రంగా క్షీణీస్తోంది
ఢిల్లీలోని ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ గత కొన్ని రోజులుగా తీవ్ర క్షీణతను చవిచూస్తోంది. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ విడుదల చేసిన డేటా ప్రకారం, ఢిల్లీ, నోయిడాలోని ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) గురువారం సాయంత్రం నాటికి 'చాలా పేలవమైన' విభాగంలోకి ప్రవేశించింది. గురుగ్రామ్, నోయిడా, గ్రేటర్ నోయిడా, ఘజియాబాద్ వంటి ప్రాంతాలలో గాలి నాణ్యత, దృశ్యమానత క్రమంగా దిగజారుతోంది. ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లోని ఆనంద్ విహార్, విమానాశ్రయం, ఆర్‌కె పురంతో సహా నిర్దిష్ట ప్రాంతాలలో, సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అందించిన జాతీయ వాయు నాణ్యత సూచిక డేటా సూచించినట్లుగా, AQI 400 మార్కులకు పైగా పెరిగింది.