Delhi : ముగ్గురు విద్యార్థులు జల సమాధి.. మరో కోచింగ్ సెంటర్ సీజ్
దిల్లీలోని ఐఏఎస్ కోచింగ్ సెంటర్ బెస్‌మెంట్‌లో వరద నీరు రావడంతో ముగ్గురు విద్యార్థులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దిల్లీలో మున్సిపల్ కార్పొరేషన్ గట్టి చర్యలను చేపట్టింది. ఇప్పటికే ఓల్డ్ రాజేందర్ నగర్ ప్రాంతంలోని 13 కోచింగ్ సెంటర్‌ను సీజ్ చేశారు. అయితే దృష్టి ఐఎఎస్ భవనం బేస్‌మెంట్‌లో తరగతులను నిర్వహిస్తుండగా, తాజాగా ఆ సెంటర్‌కు సీల్ వేశారు.
13 కోచింగ్ సెంటర్లు సీజ్
భవన నిబంధనలను ఉల్లంఘించారని ఆరోపిస్తూ మునిసిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ (MCD) ముఖర్జీ నగర్ ప్రాంతంలోని దృష్టి IAS కోచింగ్ ఇన్‌స్టిట్యూట్ బేస్‌మెంట్ ను సీజ్ చేసింది. దృష్టి ఐఏఎస్‌తో పాటు వాజిరామ్, రవి, శ్రీరామ్ ఐఏఎస్ వంటి ఇతర కోచింగ్ సెంటర్‌ల బేస్‌మెంట్లు కూడా అధికారులు సీల్ చేశారు. గత రెండు రోజుల్లో ఇప్పటివరకు 13 కోచింగ్ సెంటర్‌లకు MCD సీల్ చేసింది.
అక్రమ నిర్మాణాలు తొలగింపు
మరోవైపు రావు IAS స్టడీ సర్కిల్ సమీపంలో బుల్డోజర్లతో అక్రమ నిర్మాణాలను తొలగిస్తున్నారు. ఈ ఘటనలో పూడిక తీయలేదనే ఆరోపణలు రావడంతో ఒక జూనియర్ ఇంజనీర్, ఒక అసిస్టెంట్ ఇంజనీర్‌ను అధికారులు సస్పెండ్ చేశారు. ఇదిలా ఉండగా రావు ఐఏఎస్ స్టడీ సర్కిల్‌లో విద్యార్థులు మృతి చెందిన ఘటనపై విచారణ సాగుతోందని అధికారులు తెలిపారు. దోషులుగా ఎవరైనా తేలిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.