'దిల్లీ సర్వీసెస్ బిల్లు'కు రాజ్యసభలో ఆమోదం; సుప్రీంకోర్టుకు వెళ్లే యోచనలో ఆప్
దిల్లీ సర్వీసెస్ బిల్లు (దిల్లీ గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ (సవరణ) బిల్లు, 2023) సోమవారం రాత్రి రాజ్యసభలో ఆమోదం పొందింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టారు. ఇప్పటికే ఈ బిల్లు లోక్‌సభలో ఆమోదం పొందిన విషయం తెలిసిందే. దిల్లీలో అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్, అధికారుల పోస్టింగ్‌లతో సహా బ్యూరోక్రసీపై కేంద్రానికి మరింత నియంత్రణను అందించడమే ఈ బిల్లు లక్ష్యం. ఈ బిల్లుపై ఆమోదంపై ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్రంగా స్పందించింది. రాజ్యసభలో ఈ బిల్లు ఆమోదం పొందినప్పటికీ, సుప్రీంకోర్టులో దీనిపై పోరాడతామని రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా అన్నారు. ఇప్పుడు ఈ బిల్లుపై రాష్ట్రపతి ఆమోద ముద్ర పడితే అది చట్టంగా మారుతుంది.
వైసీపీ, బీజేడీ మద్దతుతో బిల్లు ఆమోదం
రాజ్యసభలో దిల్లీ సర్వీసెస్ బిల్లుకు అనుకూలంగా 131 మంది ఎంపీలు ఓటు వేయగా, వ్యతిరేకంగా 102 మంది ఓటు వేయడంతో బిల్లు ఆమోదం పొందింది. బిజూ జనతా దళ్ (బీజేడీ), వైసీపీ వంటి తటస్థ పార్టీలు భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడంతో బిల్లు సునాయసంగా ఆమోదం పొందింది. ఈ రెండు పార్టీల మద్దుతు లేకుంటే, బిల్లు ఆమోదం కష్టమయ్యేది. ఈ బిల్లు వల్ల దిల్లీ బ్యూరోక్రసీపై పూర్తి నియంత్రణ కేంద్రం పరిధిలోకి వస్తుంది. బ్యూరోక్రాట్‌లకు సంబంధించిన నిర్ణయాలు దిల్లీ ప్రభుత్వం తీసుకుంటుందన్న సుప్రీంకోర్టు తీర్పును అధిగమించేందుకు కేంద్రం ఈ బిల్లును తీసుకొచ్చింది.
దొడ్డిదారిన అధికారాలను లాక్కునే ప్రయత్నం: కేజ్రీవాల్
దిల్లీ బిల్లు ఆమోదంపై సీఎం అరవింద్ కేజ్రీవాల్ తీవ్రస్థాయిలో మండిపాడ్డారు. దిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీని ఓడించడం చాలా కష్టమని భావించి ఇంతపని చేశారన్నారు. బీజేపీ వరుసగా నాలుగు ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ చేతిలో ఓడిపోయిందని గుర్తుచేసారు. ప్రధాన నరేంద్ర మోదీ అహంకారిగా మారారన్నారు. ఆప్‌ను ఓడించలేక, దొడ్డిదారిన అధికారాలను లాక్కునే ప్రయత్నం చేశారన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలను ప్రధాని మోదీ పాటించడం లేదని సీఎం ఆరోపించారు. దిల్లీలో కేంద్రం జోక్యం చేసుకోకూడదని ప్రజలు స్పష్టంగా చెప్పారు. కానీ ప్రధానమంత్రి ప్రజల మాట వినడానికి కూడా ఇష్టపడటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.