Delhi Pollution: దిల్లీలో దట్టమైన పొగమంచు.. 100కు పైగా విమానాలు ఆలస్యం
దిల్లీలో వాయు నాణ్యత పరిస్థితి రోజురోజుకి మరింత దిగజారుతోంది. ప్రస్తుతం వాయు నాణ్యత సూచీ 428 (సీవియర్ కేటగిరీ)గా నమోదైంది. ఇది వరుసగా ఐదో రోజు కొనసాగుతోంది. ఈ పరిణామం కారణంగా విమాన సర్వీసులపై ప్రభావం చూపుతోంది. ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ విమానాశ్రయంలో దట్టమైన పొగమంచు వల్ల దృశ్యాలు కేవలం 800 మీటర్ల వరకు మాత్రమే కనిపిస్తున్నాయి. దీనివల్ల 107 విమానాలు ఆలస్యమయ్యాయి. మరో 3 విమానాలు రద్దయ్యాయి. ఫ్లైట్ రాడార్ సంస్థ ప్రకారం, ఈ పరిస్థితి కారణంగా ప్రయాణికులకు అప్రమత్తం చేయాలని దిల్లీ ఎయిర్‌పోర్టు, విమానయాన సంస్థలు సూచిస్తున్నాయి. దిల్లీ పరిసర ప్రాంతాల్లోని అనేక మానిటరింగ్ స్టేషన్లలో వాయు నాణ్యతా సూచీ 400 పైగా నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది.
ఇబ్బందుల్లో ప్రజలు
బవానాలో 471, అశోక్ విహార్, జహంగీర్‌పురిలో 466, ముండ్కా, వజీర్‌పుర్‌లో 463గా నమోదైంది. ఈ ప్రాంతాలు 'సీవియర్ ప్లస్' వాయు నాణ్యత కేటగిరీలోకి చేరడంతో, ప్రజలు శ్వాసకోస సంబంధిత సమస్యలు, కంటి ఇబ్బందులు, ఇతర అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశాలున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దిల్లీలో వాయు కాలుష్య స్థాయిలు పెరిగితే, అత్యవసరమైన నిర్మాణాలు, కూల్చివేతలపై నిషేధం విధించే అవకాశముందని అధికారులు తెలిపారు. దిల్లీతో పాటు నోయిడా, గురుగ్రామ్, ఘజియాబాద్, ఫరీదాబాద్‌లలో కూడా వాయు నాణ్యతా సూచీ 260 నుంచి 372 మధ్య ఉంది.