Hyderabad: శివారు ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు… హైదరాబాద్-బెంగళూరు హైవేపై భారీ ట్రాఫిక్ జామ్
ఈ వార్తాకథనం ఏంటి
హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు తీవ్ర ప్రభావం చూపింది. రాజేంద్రనగర్, శంషాబాద్ ఎయిర్‌పోర్టు, కిస్మత్‌పూర్‌తో పాటు ఔటర్ రింగు రోడ్డులోని పలు ప్రాంతాలు పూర్తిగా పొగమంచుతో కప్పబడిపోయాయి. దీనివల్ల హైదరాబాద్-శంషాబాద్ హైవేపై భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దట్టమైన పొగమంచుతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పొగమంచు తీవ్రత ఎక్కువగా ఉండటంతో అనేక మంది ప్రయాణికులు తమ వాహనాలను రహదారి పక్కన నిలిపివేయాల్సి వచ్చింది. సుమారు 10 కిలోమీటర్ల మేర వాహన రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. కొన్ని చోట్ల మాత్రమే వాహనాలు అత్యంత నెమ్మదిగా కదులుతున్న పరిస్థితి నెలకొంది.
Details
విమాన రాకపోకలకు తీవ్ర అంతరాయం
ఇదే తరహా పరిస్థితి హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై కూడా కనిపిస్తోంది. దట్టమైన పొగమంచు కారణంగా వాహనాలు నెమ్మదిగా సాగుతున్నాయి. ముఖ్యంగా అబ్దుల్లాపూర్‌మెట్-ఘట్‌కేసర్ బైపాస్ మార్గంలో పొగమంచు తీవ్రంగా అలుముకుంది. మరోవైపు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలోనూ పొగమంచు తీవ్ర ప్రభావం చూపింది. తెల్లవారుజాము నుంచి రన్‌వేపై విజిబిలిటీ పూర్తిగా జీరో స్థాయికి పడిపోవడంతో పలు విమాన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కొన్ని విమానాలు రద్దు కాగా, మరికొన్ని ఆలస్యంగా నడుస్తున్నాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. హైదరాబాద్‌కు రావాల్సిన పలు విమానాలు కూడా ఆలస్యంగా చేరనున్నట్లు సమాచారం.