Cyclone Michaung: ఆంధ్రప్రదేశ్‌లో 40లక్షల మందిపై 'మిచౌంగ్' తుపాను ప్రభావం
ఈ వార్తాకథనం ఏంటి
బంగాళాఖాతంలో ఏర్పడిన 'మిచౌంగ్' తుపాను ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర ప్రభావాన్ని చూపింది.
తుపాను మంగళవారం తీరం దాటే సమయంలో అల్లకల్లోలం సృష్టించింది.
ఈదురుగాలులు, భారీ వర్షాలతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. 770 కిలోమీటర్ల రోడ్లు దెబ్బతిన్నాయి. 35 చెట్లు నేలకూలాయి. అనేక పశువులు మరణించాయి.
రాష్ట్రంలో 194 గ్రామాలు, రెండు పట్టణాలకు చెందిన దాదాపు 40 లక్షల మంది ప్రజలు 'మిచౌంగ్' తుపాను కారణంగా అవస్థలు పడినట్లు ఏపీ సీఎంఓ వెల్లడించింది. దాదాపు 25గ్రామాలు ముంపునకు గురయ్యాయి.
'మిచౌంగ్' తుపాను వల్ల కురిసిన వర్షాల కారణంగా తమిళనాడు, ఏపీలో కలిపి 12మంది ప్రాణాలు కోల్పోయారు.
తిరుపతిలో గోడ కూలి నాలుగేళ్ల బాలుడు, బాపట్లలో మరొకరు మృతి చెందినట్లు రాష్ట్ర విపత్తు నిర్వహణ అధికారులు తెలిపారు.
తుపాను
తీవ్ర అల్పపీడనంగా మారిన తుపాను
తుపాను బుధవారం నాటికి బలహీనపడి తీవ్ర అల్పపీడనంగా మారిందని ఐఎండీ తెలిపింది.
ఇది బాపట్లకు ఉత్తర వాయువ్యంగా 100 కి.మీ, ఖమ్మంకు ఆగ్నేయంగా 50 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉందని పేర్కొంది.
రానున్న 6 గంటల్లో తుపాను మరింత బలహీనపడి అల్పపీడనంగా మారుతుందని, తదుపరి 6 గంటల్లో అల్పపీడనం బాగా తగ్గుతుందని ఐఎండీ అంచనా వేసింది.
ఆంధ్రప్రదేశ్‌లో తుపాను తీరం దాటిన తర్వాత మంగళవారం రాత్రి ఒడిశాలోని దక్షిణాది జిల్లాల్లో భారీగా వర్షాలు కురిసిశాయి.
దీంతో అక్కడి ప్రభుత్వం అప్రమత్తమైంది. తుపాను ప్రభావంతో మంగళవారం తిరుపతిలో ఏడు, నెల్లూరులో మూడు చోట్ల 200 మిల్లీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది.
నెల్లూరు జిల్లా మనుబోలులో అత్యధికంగా 366.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.
తుపాను
78 గుడిసెలు, 232 ఇళ్లు నేలమట్టం
తుపాను బాధిత జిల్లాలకు ఏపీ ప్రభుత్వం సహాయక చర్యల కోసం రూ.23 కోట్లు మంజూరు చేసింది.
78 గుడిసెలు, పశువుల కొట్టం ఉండగా, 232 ఇళ్లు తుపాను వల్ల నేలమట్టమయ్యాయి. రెండు కచ్చా ఇళ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి.
విశాఖపట్నం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, ఏలూరు జిల్లాల్లో బుధవారం 64.5 మిల్లీమీటర్ల నుంచి 115.5 మిల్లీమీటర్ల వరకు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.
చెన్నై, దాని పొరుగు జిల్లాలలో సంభవించిన భారీ నష్టాల కారణంగా రూ. 5,060 కోట్ల మధ్యంతర ఆర్థిక సహాయం కోరుతూ తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు.