
Cyclone Michaung: చెన్నైలో గోడ కూలి ఇద్దరు మృతి.. రాత్రి 11 గంటల వరకు విమానాలు రద్దు
ఈ వార్తాకథనం ఏంటి
భారీ వర్షం,ఈదురు గాలుల కారణంగా చెన్నైలోని కనత్తూర్‌లో కొత్తగా నిర్మించిన గోడ కూలి ఇద్దరు వ్యక్తులు మరణించగా,మరొకరు గాయపడ్డారు.మరణించిన వారు ఝార్ఖండ్ వాసులుగా గుర్తించారు.
భారీ వర్షాల కారణంగా రన్‌వే పై వరద నీరు చేరడంతో పలు విమానాలు రద్దు చేయడంతో పాటు మరికొన్నింటిని దారి మళ్లించారు.
చెన్నై విమానాశ్రయంలో విమాన కార్యకలాపాలు దెబ్బతిన్నాయి. తీవ్ర వాతావరణ పరిస్థితుల కారణంగా సోమవారం రాత్రి 11 గంటల వరకు విమాన సర్వీసులను నిలిపివేశారు.
అంతకుముందు, చెన్నై విమానాశ్రయానికి రాకపోకలు ఉదయం 9.17 నుండి 11.30 గంటల మధ్య నిలిపివేయబడ్డాయి.
మిచాంగ్ తుపాను తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ తీరాలకు చేరువ కావడంతో సోమవారం రాత్రి చెన్నైలో భారీ వర్షం కురిసింది.
Details
ప్రైవేట్ కంపెనీలకు ప్రభుత్వం ఆదేశాలు
భారీ వర్షం కారణంగా చెన్నైలోని పలు మెట్రో స్టేషన్ల జలమయ్యాయి. సెయింట్ థామస్ మెట్రో స్టేషన్‌లో 4 అడుగుల మేర నీరు చేరడంతో స్టేషన్‌లోకి ప్రవేశించే మార్గం నిలిచిపోయింది.
ప్రయాణికులు ఆలందూరులో మెట్రో రైలు ఎక్కాలని అధికారులు సూచించారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన 'మిచాంగ్' తుఫాను చురుగ్గా ఉందని, ఒడిశాలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని, సోమవారం నాటికి తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉందని IMD తెలిపింది.
తమిళనాడులో సోమవారం సెలవు దినంగా ప్రభుత్వం వెల్లడించింది. తుపాను దృష్ట్యా వీలైనంత వరకు ఇంటి నుంచే పని చేయించాలని ప్రైవేట్ కంపెనీలకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
Details
సిద్ధంగా ఉన్న 4,967 సహాయ శిబిరాలు
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ రాష్ట్ర అత్యవసర ఆపరేషన్ సెంటర్‌లో సన్నాహక చర్యలను సమీక్షించారు.
తిరువళ్లూరు, చెన్నై, కాంచీపురం,చెంగెల్‌పేట్ జిల్లాలనుండి మొత్తం 685 మందిని 11 సహాయ శిబిరాల్లో ఉంచారు.
కావేరి డెల్టా ప్రాంతాలతో పాటు రాష్ట్రంలోని ఉత్తర ,ఇతర తీర ప్రాంతాలలో 121 బహుళార్ధసాధక కేంద్రాలు అన్ని ప్రాథమిక సౌకర్యాలతో 4,967 సహాయ శిబిరాలు సిద్ధంగా ఉన్నాయని ప్రభుత్వం అధికారిక ప్రకటనలో తెలిపింది.
తమిళనాడులోని డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్‌కు చెందిన 14 బృందాలు, 350 మంది సిబ్బంది,నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్‌కు చెందిన 9 బృందాలు 225 మంది సిబ్బందితో మైలాడుతురై, నాగపట్నం, తిరువళ్లూరు, కడలూర్, విల్లుపురం, కాంచీపురం, చెన్నై, చెంగ్నాల్ రెస్క్యూ ఆపరేషన్‌ల కోసం తీరప్రాంతాల్లో ఉన్నాయి.