Bunny festival: దేవరగట్టు బన్నీ ఉత్సవం.. వందమంది భక్తులకు గాయాలు
ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లాలోని దేవరగట్టు గ్రామంలో ప్రతేడాది దసరా సందర్భంగా జరిగే 'బన్నీ ఉత్సవం' ఎంతో ప్రసిద్ధి. మాళ మల్లేశ్వరస్వామి ఉత్సవమూర్తులను కాపాడుకోవడంలో భాగంగా, పలు గ్రామాల ప్రజలు కర్రలతో తలపడే సమరం నిర్వహిస్తారు. ఈ సంవత్సరం కూడా అదే రీతిగా బన్నీ ఉత్సవం జరిగింది, కానీ ఈ కర్రల సమరంలో 100 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఉత్సవంలో నెరణికి, నెరణికితండా కొత్తపేట గ్రామాల భక్తులు ఒక వైపు అరికెర, అరికెర తండా, సుళువాయి వంటి ఇతర గ్రామాల భక్తులు మరో వైపు స్వామి మూర్తులను దక్కించుకునేందుకు పోరాడుతారు.
20 మందికి తీవ్రగాయాలు
ఈ పోరాటంలో గాయపడిన వారు, కాస్త గాయాలైనా సరే పసుపు రాసుకుని తిరిగి పండుగను కొనసాగిస్తారు. అయితే ఈ సారి తీవ్రంగా గాయపడిన 20 మందిని ఆదోని, బళ్లారి ఆసుపత్రులకు తరలించారు. ఇక్కడ గాయపడటం చాలా సాధారణమైందే అయినప్పటికీ, ఈ ఉత్సవం భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు. దే వరగట్టులోని 800 అడుగుల ఎత్తైన కొండపై ఉన్న మాళ మల్లేశ్వరస్వామి ఆలయం ఈ ఉత్సవానికి ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉంది.