KURNOOL : దేవరగట్టులో రణరంగంగా మారిన కర్రల సమరం.. ముగ్గురు మృతి, 100 మందికిపైగా గాయాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లాలోని దేవరగట్ట కర్రల సమరంలో ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ మేరకు ఈవెంట్ మొదలైన కాసేపటికే హై టెన్షన్ పరిస్థితుల కారణంగా పలువురు బలయ్యారు. కర్రల సమరంలో ముగ్గురు వ్యక్తులు మరణించారు. ఈ క్రమంలోనే 100మందికి పైగా తీవ్ర గాయాలపాలయ్యారు. వీరిలో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ క్రమంలోనే బాధితులందరినీ సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. సమరం మొదలైన కొద్దిసేపటికే యుద్ధ వాతావరణాన్ని తలపించింది. 11 గ్రామాల ప్రజలు పాల్గొన్న ఈ కర్రల సమరం కార్యక్రమంలో ముగ్గురు ప్రాణాలు విడిచారు. పటిష్ట బందోబస్తు నిమిత్తం భారీగా పోలీస్ బలగాలున్నా, జరగకూడని ఘోరం జరిగిపోయింది. ఫలితంగా జిల్లాలో విషాదం నిండింది.
కర్రల సమరంలో ఏటా ఇలాంటి ఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి.
బన్ని ఉత్సవం పేరుతో జరిగిన కర్రల సమరంలో ఏటా ఇలాంటి ఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి. మరోవైపు ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీగా మొహరించినా ముగ్గురి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. కర్రల సమరంలో ప్రాణాలు కోల్పోవటం, గాయాల బారిన పడటం సర్వసాధారణమే. ఈ సారి కూడా కర్రల సమరంలో రక్తం నేలకారింది. కర్రల సమరాన్ని వీక్షించేందుకు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర వాసులు, కర్నూలు జిల్లాలోని దేవరగట్టుకు చేరుకున్నారు. 2022 కంటే ఈ ఏడు ఉత్సవానికి వివిధ ప్రాంతాల నుంచి దేవరగట్టుకు భారీగా హాజరయ్యారు.