2025 నాటికి దేశంలో 10,000 కి.మీల 'డిజిటల్ హైవే' అభివృద్ధి: హైవే అథారిటీ
2024-25 నాటికి దేశవ్యాప్తంగా సుమారు 10,000 కిలోమీటర్ల ఆప్టిక్ ఫైబర్ కేబుల్స్ (ఓఎఫ్‌సీ) మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రభుత్వ యాజమాన్యంలోని ఎన్‌హెచ్‌ఏఐ కృషి చేస్తోంది. నేషనల్ హైవేస్ లాజిస్టిక్స్ మేనేజ్‌మెంట్ లిమిటెడ్ (ఎన్‌హెచ్ఎల్ఎంఎల్), ఎన్‌హెచ్‌ఏఐ యాజమాన్యం ఓఎఫ్‌సీ మౌలిక సదుపాయాల అభివృద్ధి, జాతీయ రహదారుల వెంట ఇంటిగ్రేటెడ్ యుటిలిటీ కారిడార్‌లను అభివృద్ధి చేయడం ద్వారా 'డిజిటల్ హైవే'లుగా తీర్చిదిద్దనున్నట్లు హైవే అథారిటీ పేర్కొంది. దిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్‌వేలో 1,367 కిలోమీటర్లు, హైదరాబాద్-బెంగళూరు కారిడార్‌లో 512 కిలోమీటర్లు రహదారులు డిజిటల్ హైవే అభివృద్ధికి పైలట్ ప్రాజెక్టు కింద ఎంపికైనట్లు వెల్లడించింది.
మారుమూల ప్రాంతాలకు ఇంటర్నెట్ కనెక్టివిటీని అందించడమే లక్ష్యం
దేశవ్యాప్తంగా ఉన్న మారుమూల ప్రాంతాలకు ఇంటర్నెట్ కనెక్టివిటీని అందించడం, ఓఎఫ్‌సీ నెట్‌వర్క్ 5జీ & 6జీ వంటి కొత్త యుగం టెలికాం టెక్నాలజీలను వేగవంతం చేయడంలో డిజిటల్ హైవే నెట్‌వర్క్ సహాయపడుతుందని హైవే అథారిటీ ప్రకటనలో పేర్కొంది. దిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్‌వేలో ఇటీవల ప్రారంభించబడిన 246-కిమీ దిల్లీ-దౌసా-లాల్‌సోట్ సెక్షన్ ఆప్టికల్ ఫైబర్ కేబుల్‌లను వేయడానికి ఉపయోగించే మూడు-మీటర్ల అంకితమైన యుటిలిటీ కారిడార్‌ను కలిగి ఉంది. ఇది 5జీ నెట్‌వర్క్‌ను రోల్ అవుట్ చేయడానికి వెన్నెముకగా ఉపయోగపడుతుంది. జాతీయ రహదారుల వెంబడి ఓఎఫ్‌సీ పనులు ప్రారంభమయ్యాయని, ఏడాదిలోగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు హైవే అథారిటీ చెప్పిది.