Maharastra: గవర్నర్‌తో షిండే, ఫడ్నవిస్, అజిత్ పవార్ భేటీ.. ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని వినతి
మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడణవీస్ ముచ్చటగా మూడోసారి ఎన్నికయ్యారు. ఆయన గురువారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. బుధవారం ఫడ్నవిస్ బీజేపీ శాసనసభాపక్ష నేతగా ఎన్నిక కాగా, మహాయుతి కూటమి నేతలు ముంబైలోని రాజ్‌భవన్‌లో గవర్నర్ రాధాకృష్ణన్‌ను కలిశారు. ఫడ్నవిస్‌తో పాటు ఏక్‌నాథ్ షిండే, అజిత్ పవార్, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తదితర నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎల్పీ నేతగా ఫడ్నవిస్ ఎన్నికైన పత్రాలను గవర్నర్‌కు అందజేసి, ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని కోరారు.
7:7:7 నిష్పత్తిలో మంత్రి పదవులు
ప్రమాణ స్వీకార కార్యక్రమం గురువారం సాయంత్రం 5.30 గంటలకు ముంబైలోని ఆజాద్ మైదాన్‌లో జరగనుంది. ముఖ్యమంత్రిగా ఫడ్నవిస్, డిప్యూటీ ముఖ్యమంత్రులుగా షిండే, అజిత్ పవార్ ప్రమాణం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీతో పాటు కేంద్రమంత్రులు హాజరుకానున్నారు. కొత్త ప్రభుత్వంలో షిండే కీలక పాత్ర పోషిస్తారని ఫడ్నవిస్ తెలిపారు. ఈసారి ప్రభుత్వం మూడు పార్టీల మధ్య 7:7:7 నిష్పత్తిలో మంత్రి పదవులను పంచుకోనుంది. బీజేపీ, శివసేన, ఎన్సీపీ నుంచి ఏడుగురు చొప్పున మంత్రులు ప్రమాణస్వీకారం చేయనున్నట్లు సమాచారం. బుధవారం మంత్రి పదవులపై చర్చించేందుకు ఫడ్నవిస్‌తో ఏక్‌నాథ్ షిండే సమావేశమయ్యారు. శివసేనకు సంబంధించిన శాఖల కేటాయింపుపై షిండే చర్చించారు.
మహా వికాస్ అఘాడి కూటమికి పెద్ద ఎదురుదెబ్బ
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ప్రకారం బీజేపీ 132 సీట్లు గెలుచుకోగా, శివసేన 57, ఎన్సీపీ 41, కాంగ్రెస్ 16, ఉద్ధవ్ థాక్రే 20, శరద్ పవార్ 10 సీట్లు సాధించారు. ఈ ఎన్నికల్లో మహా వికాస్ అఘాడి కూటమికి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. కాంగ్రెస్ ఓటమికి ఈవీఎంల ట్యాంపరింగ్ కారణమని ఆరోపించింది.