
Jagdeep Dhankhar: రాజీనామాకు ముందు.. ముందస్తు సమాచారం లేకుండా రాష్ట్రపతిని కలిసిన ఉపరాష్ట్రపతి
ఈ వార్తాకథనం ఏంటి
ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ అనూహ్యంగా తన పదవికి రాజీనామా చేయడం దేశవ్యాప్తంగా ఆశ్చర్యానికి గురిచేసింది. తన రాజీనామా నిర్ణయానికి ముందు ఆయన ఎలాంటి ముందస్తు షెడ్యూల్ లేకుండా రాష్ట్రపతి భవన్‌ను సందర్శించడం మరింత చర్చకు దారితీసింది. అందుతున్న సమాచారం ప్రకారం, సోమవారం రాత్రి ఆయన అకస్మాత్తుగా రాష్ట్రపతి కార్యాలయానికి వెళ్లినట్లు తెలుస్తోంది. సరిగ్గా రాత్రి 9 గంటల సమయంలో ధన్‌ఖడ్ రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి తన రాజీనామా లేఖను అందించినట్లు సమాచారం. అనంతరం సుమారు అరగంట వ్యవధిలోనే ఆయన తన రాజీనామా లేఖను సోషల్ మీడియా వేదికగా 'ఎక్స్'లో (మాజీ ట్విట్టర్) పంచుకున్నారు. అయితే, రాష్ట్రపతి భవన్‌కు ఎలాంటి అపాయింట్‌మెంట్ లేకుండా ఆయన వెళ్లడం అధికార వర్గాలను, విశ్లేషకులను ఆశ్చర్యానికి గురిచేసింది.
వివరాలు
గోవింద్ మోహన్ సంతకంతో గెజిట్ నోటిఫికేషన్
ఇందులో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. రాష్ట్రపతి కార్యాలయాన్ని సందర్శించేవారి షెడ్యూల్ సాధారణంగా చాలా ముందుగానే సిద్ధం చేస్తారు. అలాంటిది ఒక అత్యున్నత రాజ్యాంగ పదవిలో ఉన్న నాయకుడు ఎలాంటి అపాయింట్‌మెంట్ లేకుండా అక్కడికి వెళ్లిన ఉదాహరణ ఇదే మొదటిసారి కావచ్చని పలువురు నిపుణులు పేర్కొంటున్నారు. దీంతో రాష్ట్రపతి కార్యాలయ సిబ్బంది తొలుత గందరగోళానికి లోనయ్యారని, అయితే వెంటనే అప్రమత్తమై భేటీకి అవసరమైన ఏర్పాట్లను తక్షణమే పూర్తి చేశారని తెలుస్తోంది. జగదీప్ ధన్‌ఖడ్ రాజీనామా లేఖను రాష్ట్రపతి మంగళవారం అధికారికంగా ఆమోదించారు. ఆ తర్వాత కేంద్ర హోం శాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ సంతకంతో గెజిట్ నోటిఫికేషన్ విడుదలైంది. ప్రస్తుతం కొత్త ఉపరాష్ట్రపతిని ఎన్నిక చేసే వరకూ రాజ్యసభను డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నడిపించనున్నారు.
వివరాలు
నూతన ఉపరాష్ట్రపతి ఎన్నికల ప్రక్రియ ప్రారంభం
ధన్‌ఖడ్ రాజీనామాతో ఉపరాష్ట్రపతి ఎన్నికల ప్రక్రియ వేగంగా ముందుకు సాగుతోంది. కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే ఏర్పాట్లను ప్రారంభించింది. ఇందులో భాగంగా లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు కలిసిన ఎలక్టోరల్ కాలేజీతో సంప్రదింపులు చేపడుతోంది. రిటర్నింగ్ ఆఫీసర్ల నియామకానికి అవసరమైన కార్యాచరణను కూడా ప్రారంభించింది. అనారోగ్య కారణాలతో ధన్‌ఖడ్ ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేసినట్లు అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే.