LOADING...
Dharmasthala burials: మృతదేహాలను వెలికితీసే ప్రక్రియను ప్రారంభించిన సిట్ 
మృతదేహాలను వెలికితీసే ప్రక్రియను ప్రారంభించిన సిట్

Dharmasthala burials: మృతదేహాలను వెలికితీసే ప్రక్రియను ప్రారంభించిన సిట్ 

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 29, 2025
05:18 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం కలిగించిన కర్ణాటకలోని ధర్మస్థళ సామూహిక ఖననాల కేసులో ఆసక్తికర వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి. ధర్మస్థళ దేవాలయానికి గతంలో పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేసిన ఓ వ్యక్తి ఇటీవల కీలక ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. అతను ధర్మస్థళ పరిసర ప్రాంతాల్లో వందలాది మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించానని పేర్కొన్నాడు. ఈ ఫిర్యాదును జూలై 4న అధికారులకు సమర్పించాడు. దీనిపై స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (ఎస్‌ఐటీ) నియమించింది.

వివరాలు 

15 అనుమానిత ప్రాంతాల గుర్తింపు

ఇటీవల ఫిర్యాదుదారు తాను శవాలను పూడ్చిన లేదా కాల్చిన 15ప్రాంతాలను విచారణ అధికారులకు చూపించాడు. వాటిలో ఒక ప్రదేశం జాతీయ రహదారి పక్కన ఉండగా,మిగిలినవి నేత్రావతి నదీ తీరాన ఉన్నాయని తెలుస్తోంది. ఈప్రాంతాల్లో విచారణకు అంతరాయం కలగకుండా ఎస్‌ఐటీ అధికారులు జియో ట్యాగింగ్‌ నిర్వహించి,సంబంధిత ప్రదేశాల ఫొటోలు తీసి అక్కడి వద్ద భద్రత కోసం సాయుధ పోలీసులను మోహరించారు. ఈకేసులో మరింత తీవ్రత కలిగించే అంశం ఏమిటంటే,1998 నుంచి 2014వరకు.. సుమారు 16ఏళ్ల కాలంలో.. కొందరి ఒత్తిడితో తాను వందలాది మృతదేహాలకు అంత్యక్రియలు చేయాల్సి వచ్చిందని ఫిర్యాదుదారు పేర్కొన్నాడు. అతని ప్రకారం,ఈ మృతదేహాల్లో చాలా మంది మహిళలు,మైనర్ బాలికలు ఉన్నారు.తన ఫిర్యాదుతో పాటు జూలై 4న ఒక పుర్రెను సాక్ష్యంగా అధికారులకు అందజేశాడు.

వివరాలు 

డీజీపీ ప్రణబ్‌ మహంతి నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందం 

ఈ ఘటనకు సంబంధించి కర్ణాటక ప్రభుత్వం జూలై 19న డీజీపీ ప్రణబ్‌ మహంతి నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. అనంతరం ఎస్‌ఐటీ అధికారులు ఫిర్యాదుదారుని రెండు రోజులపాటు మంగళూరులో ప్రశ్నించారు. విచారణాధికారి జితేంద్ర కుమార్ దయామా ఆ వివరాలను నమోదు చేశారు. అనంతరం జూలై 22న ఫిర్యాదుదారుడితో కలిసి అధికారుల బృందం అనుమానిత ప్రదేశాలను పరిశీలించింది. మొత్తం 15 ప్రాంతాలు గుర్తించబడ్డాయి. ఈ దర్యాప్తులో ఫోరెన్సిక్, ఆంత్రోపాలజీ (మానవ శరీర నిర్మాణం శాస్త్రం), రెవెన్యూ శాఖల నిపుణులు పాల్గొన్నారు. ఈ ప్రాంతాల్లో తవ్వకాలు చేపట్టేందుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది.

వివరాలు 

స్పందించిన ధర్మస్థళ మంజునాథేశ్వర ఆలయ ట్రస్ట్‌

ఇక ఈ విచారణపై ధర్మస్థళ మంజునాథేశ్వర ఆలయ ట్రస్ట్‌ స్పందిస్తూ దర్యాప్తును స్వాగతించింది. పారదర్శక విచారణ జరగాలని కోరింది. అదే సమయంలో ప్రజాస్వామిక హక్కుల పరిరక్షణ కోసం పనిచేస్తున్న న్యాయవాదులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ఎస్‌ఐటీ దర్యాప్తుపై న్యాయస్థానం పర్యవేక్షణ అవసరమని అభిప్రాయపడ్డారు. అలాగే విచారణ పూర్తిగా నిష్పక్షపాతంగా సాగాలంటే ఫోరెన్సిక్ నిపుణుల సహకారం తీసుకోవాలని సూచించారు.