
#NewsBytesExplainer: ధర్మస్థలో 300 హత్యలు..? ఆలయ పెద్దల ప్రమేయంపై ఆరోపణలు నిజమేనా?
ఈ వార్తాకథనం ఏంటి
కర్ణాటక రాష్ట్రంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ధర్మస్థల.. పశ్చిమ కనుమల్లో ఉన్న ఈ ప్రాంతం మంజునాథ స్వామి ఆలయంతో ప్రత్యేక గుర్తింపును సంతరించుకుంది. నిత్యం వేలాదిమంది భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు ఇక్కడికి చేరుకుంటుంటారు. కానీ ప్రస్తుతం ఈ పవిత్ర స్థలం భయానక ఆరోపణలతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. గత రెండు దశాబ్దాలుగా వందలాది హత్యలు, లైంగిక దాడులు జరిగాయంటూ ఓ పారిశుద్ధ్య కార్మికుడు చేసిన ఫిర్యాదు భారత దేశాన్ని ఒక్కసారిగా కుదిపేసింది. ఈ హత్యలకు కారణమైనవారు ఎవరు? ఇన్నాళ్లు ఈ భీకర నిజం ఎలా దాగి ఉండిపోయింది? కర్ణాటక ప్రభుత్వం ఇప్పుడేమి చేస్తోంది? అన్న ప్రశ్నలు ప్రజలను కలవరపెడుతున్నాయి.
వివరాలు
పారిశుద్ధ్య కార్మికుడి సంచలన ఆరోపణలు
ధర్మస్థలప్రాంతంలో వందలాదిమంది హత్యకు గురయ్యారని..ఆ శవాలను తానే స్వయంగా ఖననం చేశానని ఓ పారిశుద్ధ్య కార్మికుడు సంచలన విషయాన్ని బయటపెట్టాడు. 1995 నుంచి 2014వరకు మంజునాథ ఆలయంలో పనిచేసిన ఈ వ్యక్తి జూలై 3న దక్షిణ కన్నడ జిల్లా పోలీసులకు తన భయానక అనుభవాలను తెలియజేశాడు. తన 20ఏళ్ల సేవా కాలంలో వందలాది శవాలను తానే పాతిపెట్టానని,కొన్నింటిని డీజిల్ పోసి తగలబెట్టానని వెల్లడించాడు. మృతుల్లో ఎక్కువగా మహిళలు,మైనర్ బాలికలే ఉన్నారని,వారికి లైంగిక వేవేధించి,యాసిడ్ దాడులకు పాల్పడి చంపారని ఆరోపించాడు. "నాకు ఇష్టం లేకపోయినా బలవంతంగా పని చేయించుకున్నారు.నోరు విప్పితే చంపేస్తామని బెదిరించారు,"అంటూ పోలీసులకు చెప్పాడు. మృతదేహాలను నేత్రావతి నది తీరంలో,ఆలయం దగ్గర ఉన్న అడవుల్లో పాతిపెట్టినట్లు, కొన్ని శవాలను నదిలో విసిరేసినట్లు వివరించాడు.
వివరాలు
ఆలయ పెద్దల ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు
ఈ హత్యల వెనుక ఆలయంలో ఉన్న శక్తివంతమైన వ్యక్తులే ఉన్నారని కార్మికుడు ఆరోపిస్తున్నాడు. శవాలను ఎక్కడ ఖననం చేయాలో, ఎవరిని ఎలా చంపాలో ఆలయ పెద్దలే ఆదేశాలు ఇచ్చారని తెలిపాడు. "నోరు విప్పితే నిన్ను, నీ కుటుంబాన్ని కూడా చంపేస్తాం" అంటూ బెదిరించారని చెప్పాడు. 1998లో ఒకసారి పోలీసులకు ఫిర్యాదు చేయబోయినప్పుడు తీవ్రంగా కొట్టి భయపెట్టారని వివరించాడు. 2014లో తన కుటుంబంలోని ఓ బాలికపై లైంగిక దాడి జరిగిన తర్వాత తాను తీవ్ర మానసిక వేదనకు గురై, భయంతో ధర్మస్థల వదిలేసి పొరుగు రాష్ట్రానికి పారిపోయినట్లు వెల్లడించాడు. దశాబ్దం తర్వాత మళ్లీ అపరాధ భావంతో తిరిగి వచ్చి, ఒక మృతదేహాన్ని బయటకు తవ్వి తీసిన ఫోటోలను, ఉద్యోగానికి సంబంధించిన ఆధారాలను పోలీసులకు సమర్పించాడు.
వివరాలు
FIR నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు
కార్మికుడి ఫిర్యాదు దేశవ్యాప్తంగా కలకలం రేపడంతో, పోలీసులు ఈ ఫిర్యాదు ఆధారంగా FIR నమోదు చేసి సమగ్రంగా దర్యాప్తు చేస్తున్నారు. . జూలై 4న ధర్మస్థల పోలీస్ స్టేషన్‌లో భారతీయ న్యాయ సంహిత (BNS) కింద హత్య కేసు నమోదు చేశారు. 1995-2014 మధ్య 100 నుంచి 300 హత్యలు జరిగాయన్న కార్మికుడి ఆరోపణలపై దర్యాప్తు మొదలైంది. మృతుల్లో అధికంగా మహిళలు, మైనర్ బాలికలే ఉన్నారని, వారిపై లైంగిక దాడులు, యాసిడ్ దాడులు జరిగాయని ఆరోపించాడు. 2010లో 12-15 ఏళ్ల బాలికను స్కూల్ బ్యాగ్‌తో పాటు పాతిపెట్టినట్లు, 2008లో ఓ 20 ఏళ్ల యువతిని యాసిడ్ దాడితో చంపి, న్యూస్ పేపర్‌లో మడిచిపెట్టి డీజిల్ పోసి తగలబెట్టినట్లు వివరించాడు.
వివరాలు
20 ఏళ్లు ఎందుకు మౌనంగా ఉన్నాడు?
ఇన్ని దారుణాలు చూస్తూ కూడా 20 ఏళ్లపాటు కార్మికుడు ఎందుకు మౌనంగా ఉన్నాడు? అనే ప్రశ్న అందరిలోనూ సందేహంగా మారింది. అయితే అతను భయంతోనే మౌనంగా ఉన్నానని చెప్పాడు. "నోరు విప్పితే నన్ను కూడా ఖననం చేస్తామని హెచ్చరించారు. అందుకే ఇన్నాళ్లూ భయంతో నోరు తెరవలేకపోయాను" అని వివరించాడు. ధర్మస్థల వదిలి వెళ్లిన తర్వాత కూడా మనశ్శాంతి లేక, అపరాధ భావంతో తట్టుకోలేక తిరిగి వచ్చి ఫిర్యాదు చేశానని చెప్పాడు. "అన్ని శవాలకు సరిగ్గా అంత్యక్రియలు జరిగితే వారి ఆత్మలకు శాంతి లభిస్తుంది. నాకు కూడా కొంత మనశ్శాంతి లభిస్తుంది" అని తెలిపాడు. స్థానిక కార్యకర్తలు, పాత్రికేయులు ధైర్యం చెప్పడంతో తనను తాను గట్టిగా నమ్ముకుని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
వివరాలు
మిస్సింగ్ కేసులు ఎందుకు వెలుగులోకి రాలేదు?
వందలాది మంది హత్యలకు గురైతే,వారి కుటుంబాలు ఎందుకు మౌనంగా ఉన్నాయనేది మరో కీలక ప్రశ్న. ధర్మస్థల ప్రాంతంలో అంతగా మిస్సింగ్ కేసులు ఎందుకు బయటపడలేకపోయాయనే సందేహాలు మొదలయ్యాయి. అయితే,1995-2014మధ్య దక్షిణ కన్నడ పోలీస్ రికార్డుల ప్రకారం 250మిస్సింగ్ కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. ఆలయానికి వచ్చిన భక్తులు,స్థానిక గ్రామస్తులు,మైనర్ బాలికలు వీరిలో ఉన్నారు. కానీ ఆధారాల లోపంతో చాలా కేసులు మూసేశారు.2012లో 17ఏళ్ల సౌజన్య లైంగిక దాడి,హత్య కేసు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. కానీ 2023లోప్రధాన నిందితుడిగా భావించిన వ్యక్తి నిర్దోషిగా విడుదలయ్యాడు. 2003లో మిస్సింగ్ అయిన MBBS విద్యార్థిని అనన్య భట్ కేసు కూడా ఇప్పుడు తిరిగి తెరపైకి వచ్చింది. ఆమె తల్లి సుజాత భట్ ఫిర్యాదు అనంతరం కేసును మళ్లీ తెరవాలని కోరుతోంది.
వివరాలు
మిస్సింగ్ కేసులు, హత్యలపై ఆందోళనలు
గతంలో కూడా ధర్మస్థలలో అనుమానాస్పద మరణాలు, మిస్సింగ్ కేసులపై కొన్ని ఆందోళనలు జరిగాయి. కానీ ఆందోళనలన్నీ ఎవరో పెద్దల ఒత్తిడి వల్లే అణచివేయబడ్డాయి. 2013లో సౌజన్య హత్య కేసులో CPM నేతృత్వంలో పెద్ద స్థాయిలో నిరసనలు జరిగినా చివరికి ఆందోళనలు తగ్గిపోయాయి. 1987లో పద్మలత అనే బాలిక హత్య కేసు సరిగా దర్యాప్తు జరగలేదు. సౌజన్య కేసులో ఆలయ నిర్వాహకుడు డాక్టర్ వీరేంద్ర హెగ్డే కుటుంబాన్ని కూడా ఆరోపించారు. కానీ నిరూపించలేకపోయారు. ఇప్పటికీ ఆలయంలోని శక్తివంతమైన వ్యక్తుల ప్రమేయం ఉందని కార్మికుడు ఆరోపిస్తున్నారు. ఆలయానికి సంబంధించిన ఆస్తులు, భారీ ఆదాయం, భూ వివాదాలు కొన్ని హత్యలకు కారణమై ఉండవచ్చని అనుమానిస్తున్నారు.
వివరాలు
SIT ఏర్పాటు చేసిన ప్రభుత్వం
ఈ సంచలన ఆరోపణల నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT)ను ఏర్పాటు చేసింది. జూలై 19న IPS అధికారి ప్రణవ్ మోహంతి నేతృత్వంలో SIT ఏర్పాటు చేసి, నేత్రావతి నది తీరంలో, ఆలయ పరిసర ప్రాంతాల్లో తవ్వకాలు ప్రారంభించింది. సాక్షుల విచారణ, ఫోరెన్సిక్ ఆధారాల సేకరణ మొదలైంది. పారిశుద్ధ్య కార్మికుడి వాంగ్మూలం, అందించిన ఆధారాల ఆధారంగా SIT దర్యాప్తు చేస్తోంది. అయితే, గతంలో సౌజన్య కేసులో పోలీసులు నిర్లక్ష్యం చేయడం, CCTV ఫుటేజీలను తొలగించడంలాంటి ఘటనలు పెద్దల జోక్యాన్ని వెల్లడిస్తున్నాయని స్థానికులు అనుమానిస్తున్నారు.
వివరాలు
దర్యాప్తుపై అనుమానాలు
దర్యాప్తు నిష్పక్షపాతంగా జరిగిందా? లేదా? అన్న అనుమానాలు ప్రజల్లో చెలరేగుతున్నాయి. కర్ణాటక స్టేట్ మహిళా కమిషన్ అధ్యక్షురాలు నాగలక్ష్మి చౌదరి, గత 20 ఏళ్ల మిస్సింగ్ కేసులు, అనుమానాస్పద మరణాలపై నివేదిక కోరారు. రిటైర్డ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి వి. గోపాల గౌడ కూడా SIT దర్యాప్తు న్యాయమూర్తి పర్యవేక్షణలో సాగాలని డిమాండ్ చేశారు. ధర్మస్థల మాస్ మర్డర్స్ కేసు నిజంగా బయటపడుతుందా? లేక ఆరోపణలతోనే ఆగిపోతుందా? అన్న ప్రశ్నలకు సమాధానం త్వరలోనే తేలనున్నది.