BRICS: "మా మద్దతు ఎప్పుడూ దౌత్యానికే".. బ్రిక్స్ సదస్సులో ప్రధాని మోదీ
రష్యాలో జరుగుతున్న బ్రిక్స్ సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ కీలకమైన వ్యాఖ్యలు చేశారు. భారతదేశం అంతర్జాతీయ దౌత్యం, చర్చలకు మద్దతు ఇస్తుందని, యుద్ధానికి వ్యతిరేకంగా కాదని ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, పశ్చిమాసియా ఆర్థిక అస్థిరతలు, వాతావరణ మార్పులు, ఉగ్రవాదం వంటి సమస్యలపై ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచాన్ని సరైన దిశలో నడిపించడంలో బ్రిక్స్ సానుకూల పాత్ర పోషించగలదని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
బ్రిక్స్ భాగస్వాములుగా ఇతర దేశాలను ఆహ్వానించడానికి సిద్ధం: మోదీ
"కొవిడ్ వంటి సవాళ్లను ఎదుర్కొన్నట్లుగా, మనం భవిష్యత్తు తరాలకు కొత్త అవకాశాలు సృష్టించగలం. ఉగ్రవాదం, ఉగ్ర సంస్థలకు వనరులను సమకూర్చడం కట్టడి చేయాలంటే ద్వంద్వ ప్రమాణాలు పాటించకూడదు. ఉగ్రవాదాన్ని ఉగ్రవాదంగా మాత్రమే చూడాలి. మన దేశాల్లో యువతను అతివాద భావజాలం వైపు మరల్చే చర్యలను అడ్డుకునేందుకు చురుగ్గా వ్యవహరించాలి. సైబర్ సెక్యూరిటీ, సురక్షిత కృత్రిమ మేధకానికి అంతర్జాతీయ నియంత్రణలను తీసుకువచ్చేందుకు మనందరం కృషి చేయాలి" అని ఆయన సూచించారు. భారత్ బ్రిక్స్ భాగస్వాములుగా ఇతర దేశాలను ఆహ్వానించడానికి సిద్ధంగా ఉందని మోదీ పేర్కొన్నారు. ఈ విషయంలో వ్యవస్థాపక సభ్య దేశాల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలని ఆయన అన్నారు. ఐరాస భద్రతా మండలిలో,ఇతర అంతర్జాతీయ సంస్థల్లో సంస్కరణల అవసరాన్ని మరోసారి గుర్తు చేశారు.
కూటమి విస్తరణ తర్వాత ఇదే తొలి శిఖరాగ్ర సదస్సు
గ్లోబల్ సౌత్ దేశాల ఆకాంక్షలను పరిగణనలోకి తీసుకోవాలని ఆయన సూచించారు. భిన్నమైన ఆలోచనల, భావజాలాల సమ్మేళనంగా ఏర్పడిన బ్రిక్స్, ప్రపంచానికి స్ఫూర్తిగా నిలుస్తుందని అన్నారు. ఇది 'బ్రిక్స్' కూటమి 16వ శిఖరాగ్ర సదస్సు. ఈ సందర్భంగా సభ్య దేశాల నాయకులు దిగిన గ్రూప్ ఫొటోను భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ ఎక్స్ వేదికగా పంచుకున్నారు. బ్రెజిల్, రష్యా, భారత్, చైనా,యు దక్షిణ ఆఫ్రికాతో కలిసి బ్రిక్స్ కూటమి ఏర్పడింది. ఇప్పుడు ఈ కూటమిని విస్తరించి ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, సౌదీ అరేబియా, యూఏఈలకు సభ్యత్వం ఇవ్వడం జరిగింది. కూటమి విస్తరణ తర్వాత ఇదే తొలి శిఖరాగ్ర సదస్సు.