LOADING...
Mangalagiri AIIMS: మంగళగిరి ఎయిమ్స్‌లో డయేరియా కలకలం.. 25 మంది విద్యార్థులు,సిబ్బందికి  అస్వస్థత
25 మంది విద్యార్థులు,సిబ్బందికి  అస్వస్థత

Mangalagiri AIIMS: మంగళగిరి ఎయిమ్స్‌లో డయేరియా కలకలం.. 25 మంది విద్యార్థులు,సిబ్బందికి  అస్వస్థత

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 09, 2026
02:25 pm

ఈ వార్తాకథనం ఏంటి

గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో డయేరియా లక్షణాలు కలకలం రేపుతున్నాయి. అక్కడి వసతి గృహాల్లో నివసిస్తున్న వైద్య విద్యార్థులు, క్వార్టర్స్‌లో ఉంటున్న కొంతమంది సిబ్బంది గత మూడు రోజులుగా వాంతులు, విరేచనాలతో బాధపడుతున్నట్లు సమాచారం. ఈ లక్షణాల కారణంగా పలువురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. పరిస్థితిని గమనించిన ఎయిమ్స్ ఉన్నతాధికారులు వెంటనే అప్రమత్తమై బాధితులకు ఆసుపత్రిలోనే ప్రత్యేక చికిత్స అందిస్తున్నారు. డయేరియా ఎలా వ్యాపించిందో తెలుసుకునేందుకు అధికారులు సమగ్ర విచారణ కూడా ప్రారంభించారు. ప్రస్తుతం బాధితులంతా వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది.

వివరాలు 

బాధితులకు ప్రత్యేక చికిత్స

మంగళగిరి ఎయిమ్స్‌లో డయేరియా అనుమానిత లక్షణాలతో పలువురు వైద్య విద్యార్థులు ఆసుపత్రిలో చేరడం ఆందోళన కలిగిస్తోంది. వసతి గృహాల్లో ఉండే విద్యార్థులు, క్వార్టర్స్‌లో నివసించే సిబ్బందిలో మొత్తం 25 మంది వరకు గత మూడు రోజులుగా వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. కొందరికి జ్వరం కూడా రావడంతో వారికి ఎయిమ్స్‌లోనే ప్రత్యేక వైద్యం అందిస్తున్నారు. విద్యార్థుల్లో ఈ లక్షణాలు కనిపించడంతో ఎయిమ్స్ యాజమాన్యం అప్రమత్తమైంది. వ్యాధి వ్యాప్తి వెనుక ఉన్న కారణాలను గుర్తించేందుకు అధికారులు సమగ్రంగా పరిశీలిస్తున్నారు.

వివరాలు 

డయేరియా వ్యాప్తికి కారణాలపై అనుమానాలు

ఇటీవల గుంటూరు జిల్లాలో డయేరియా లక్షణాలతో పలువురు ఆసుపత్రుల్లో చేరుతున్న పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఎయిమ్స్‌లో బాధితుల్లో వాంతులు,విరేచనాలు ఎక్కువగా ఉండటంతో నీటి కాలుష్యం కారణం కావచ్చని ప్రాథమికంగా అధికారులు అనుమానిస్తున్నారు. నీటి సరఫరా ఎక్కడి నుంచి జరుగుతోంది? మధ్యలో ఏ ప్రాంతంలో కలుషితం అయ్యే అవకాశం ఉందా? అనే అంశాలపై అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. నీటి పైపుల మార్గంలో ఎక్కడైనా మురుగునీరు కలిసిందా? లేదా ఇతర బ్యాక్టీరియా నీటిలో చేరిందా? అనే కోణంలో పరిశీలనలు కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించి వసతి గృహాల కుళాయిల నుంచి సుమారు 40నీటి నమూనాలను సేకరించి ప్రయోగశాలకు పంపించారు. అంతేకాకుండా హాస్టల్‌లలో వాడుతున్న ఆహార నమూనాలు,బాధితుల మల నమూనాలను కూడా పరీక్షల కోసం పంపించినట్లు అధికారులు తెలిపారు.

Advertisement

వివరాలు 

కట్టడి చర్యలు ప్రారంభించిన అధికారులు

బాధితుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఎయిమ్స్ వసతి గృహాల్లో అధికారులు తక్షణ కట్టడి చర్యలు చేపట్టారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. విద్యార్థులకు వేడి చేసిన శుద్ధినీటిని అందించేలా ఏర్పాట్లు చేశారు. అలాగే కలుషితమై ఉండొచ్చని అనుమానిస్తున్న నీటి సరఫరాను తాత్కాలికంగా నిలిపివేశారు. ఎయిమ్స్‌లో కొంతమంది విద్యార్థులు డయేరియా లక్షణాలతో బాధపడుతున్న విషయం నిజమేనని ఎయిమ్స్ డైరెక్టర్ శాంతా సింగ్ తెలిపారు. కొన్ని అనారోగ్య సమస్యలు ఉన్నట్లు తమ దృష్టికి వచ్చినట్టు సూపరింటెండెంట్ కూడా వెల్లడించారు.

Advertisement

వివరాలు 

రాష్ట్రవ్యాప్తంగా పెరుగుతున్న కేసులు

మంగళగిరిలో మాత్రమే కాకుండా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కూడా డయేరియా కేసులు ఇటీవల పెరుగుతున్నాయి. గుంటూరు, విజయవాడ, శ్రీకాకుళం వంటి ప్రాంతాల్లో కూడా ఈ వ్యాధి వ్యాప్తి ఎక్కువగా నమోదవుతోంది. దీంతో పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి ప్రభుత్వం అప్రమత్తమైంది. బాధితులకు మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. డయేరియా ప్రభావిత ప్రాంతాల్లో ట్యాంకర్ల ద్వారా తాగునీరు సరఫరా చేయాలని, పారిశుద్ధ్య చర్యలు కట్టుదిట్టంగా చేపట్టాలని సూచించింది.

వివరాలు 

రాష్ట్రవ్యాప్తంగా పెరుగుతున్న కేసులు

దీంతో వ్యాధి ప్రభావం తగ్గే అవకాశం ఉందని వైద్య సిబ్బంది అభిప్రాయపడుతున్నారు. ఇక భవిష్యత్తులో డయేరియా వ్యాధి వ్యాప్తి చెందకుండా ఉండేందుకు కూటమి ప్రభుత్వం అధికారులకు ప్రత్యేక సూచనలు చేసింది. ప్రజలు కూడా జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. ప్రతి ఇంటికి సరఫరా చేసే తాగునీటి ట్యాంకులను తరచూ శుభ్రం చేయాలని, అలాగే ఇంటి చుట్టూ ఉన్న పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని వైద్యులు సూచించారు.

Advertisement