Digital Payments: పట్టణ స్థానిక సంస్థల్లో డిజిటల్ విధానం.. త్వరలోనే అమల్లోకి!
పట్టణ స్థానిక సంస్థల్లో ఆస్తిపన్ను, ఇతర వసూళ్ల కోసం డిజిటల్ విధానాన్ని త్వరలో అందుబాటులోకి తేనున్నారు. మొబైల్, ఆన్‌లైన్, పీఓఎస్‌తో పన్ను వసూళ్లను సులభతరం చేయనున్నారు. ఆన్‌లైన్‌లో చెల్లింపు విధానం ఉన్న ప్రజలు దానిపై మొగ్గు చూపకపోవడం గమనార్హం. ఈ సమస్యను అధిగమించేందుకు డిజిటల్ విధానాలతో ముందుకెళ్లాలని ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పుర, నగరపాలక సంస్థలు, నగర పంచాయతీలో ఏటా రూ.2వేల కోట్లకు పైగా ఆస్తి పన్ను ఉన్నా 50-60 శాతానికి మించి వసూలు కాలేదు. ఇందుకోసం ఈ చివరి మూడు నెలలు స్పెషల్ డ్రైవ్ లు నిర్వహించనున్నట్లు తెలిసింది.
వందకోట్లలో బకాయిలు
ఇక నగర పాలక సంస్థ కార్యాలయాలకు ప్రజలు వెళ్లి, క్యూలో నిలబడాల్సి ఆస్తిపన్ను చెల్లించాల్సి వస్తోంది. గతంలో రెవెన్యూ సిబ్బంది ఇంటికొచ్చి వసూలు చేశారు. ముఖ్యంగా నగరాల్లో ఆస్తులున్న వారు చాలామంది స్థానికంగా ఉండరు. వేరే ప్రాంతాల్లో నివసిస్తుంటారు. వీరికి ఆస్తి పన్ను చెల్లించడానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇలాంటి వారి కారణంగా ఆస్తి పన్ను వందల కోట్లలో పెరిగిపోయాయి.
ఆరు నెలలకోసారి ఆస్తిపన్ను బకాయి మెసేజ్
డిజిటల్ విధానాన్ని పట్టణ స్థానికసంస్థల్లో త్వరగా అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. ఆస్తిపన్ను చెల్లింపుదారుల మొబైల్ నంబర్లకే ఆరు నెలలకోసారి ఆస్తిపన్ను బకాయి మెసేజ్ వెళ్లేలా నోటిఫికేషన్ ఇవ్వనున్నారు. దీంతో వారు క్యూఆర్ కోడ్ ద్వారా పన్ను చెల్లించే అస్కారం ఉంటుంది. దీనివల్ల ఎక్కడివారైనా సులభంగా పన్ను చెల్లించే అవకాశం ఉంటుంది. ఇక ప్రజలు కార్యాలయానికి వెళ్లి క్యూ లైన్లో నిలబడే బాధ తీరనుంది.