Page Loader
Andhrapradesh: ఎన్డీఆర్‌ఎఫ్, ఎన్‌ఐడీఎం కేంద్రాలు సిద్ధం! ఈ నెల 19న ప్రారంభించనున్న కేంద్ర హోంమంత్రి అమిత్‌షా
ఎన్డీఆర్‌ఎఫ్, ఎన్‌ఐడీఎం కేంద్రాలు సిద్ధం!

Andhrapradesh: ఎన్డీఆర్‌ఎఫ్, ఎన్‌ఐడీఎం కేంద్రాలు సిద్ధం! ఈ నెల 19న ప్రారంభించనున్న కేంద్ర హోంమంత్రి అమిత్‌షా

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 16, 2025
08:48 am

ఈ వార్తాకథనం ఏంటి

నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ (ఎన్‌ఐడీఎం), నేషనల్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ ఫోర్స్‌ (ఎన్డీఆర్‌ఎఫ్‌) ప్రాంగణాలు విపత్తులను ఎదుర్కోవడంలో కీలక పాత్ర పోషిస్తాయి. కేంద్ర ప్రభుత్వం పరిధిలోని ఈ ప్రతిష్ఠాత్మక విభాగాలకు ఆంధ్రప్రదేశ్‌లో ప్రత్యేక ప్రాంగణాలు సిద్ధమయ్యాయి. ఈ నెల 19న కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా చేతుల మీదుగా ఇవి ప్రారంభం కానున్నాయి. కృష్ణా జిల్లా గన్నవరం మండలం కొండపావులూరులో ఎన్‌ఐడీఎం, ఎన్డీఆర్‌ఎఫ్‌ ప్రాంగణాలు పూర్తిగా నిర్మితమయ్యాయి. దీర్ఘ తీర ప్రాంతం కలిగిన రాష్ట్రంలో ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొనేందుకు, సకాలంలో సహాయ చర్యలు చేపట్టేందుకు ఈ కేంద్రాలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఆధునిక సాంకేతికతతో ముందస్తు హెచ్చరికలను అందించి విపత్తులను సమర్థంగా నిర్వహించడంలో ఇవి కీలకంగా ఉంటాయి.

వివరాలు 

ఎన్డీఆర్‌ఎఫ్‌ పదో బెటాలియన్‌ ఏర్పాటు.. ఉమ్మడి రాష్ట్రానికి మంజూరు

ఎన్డీఆర్‌ఎఫ్‌ పదో బెటాలియన్‌ ఏర్పాటులో భాగంగా 2012లో కేంద్రం దీన్ని ఉమ్మడి రాష్ట్రానికి మంజూరు చేసింది. తాత్కాలికంగా గుంటూరు జిల్లా ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం క్యాంపస్‌లో కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. 2017లో కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ శాశ్వత క్యాంపస్‌కు శంకుస్థాపన చేయగా, 50 ఎకరాల్లో దీనిని ఏర్పాటు చేశారు. ఈ బెటాలియన్‌ పరిధిలో ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలు ఉన్నాయి. ఇందులో 846 మంది సుశిక్షిత సిబ్బంది పనిచేస్తుండగా, ఇప్పటివరకు 754 ఆపరేషన్లు నిర్వహించి, లక్ష మందికి పైగా బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కొండపావులూరులో 11 బృందాలు, విశాఖలో 2, హైదరాబాద్‌లో 1, కర్ణాటకలో 4 బృందాలు పనిచేస్తున్నాయి.

వివరాలు 

అమిత్‌షా చేతుల మీదుగా ప్రారంభం 

దిల్లీ తర్వాత ఎన్‌ఐడీఎం కేంద్రం ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటైంది. 2014 పునర్విభజన చట్టంలో దీన్ని ఏపీకి కేటాయించగా, కొండపావులూరులో ఎన్డీఆర్‌ఎఫ్‌ ఎదురుగా 10 ఎకరాల స్థలంలో నిర్మాణం జరిగింది. 2018లో నాటి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పనులకు శంకుస్థాపన చేయగా, రూ.36.43 కోట్ల వ్యయంతో ఇది పూర్తయింది. దక్షిణాది రాష్ట్రాలకు సేవలు అందిస్తూ, ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొనేందుకు యంత్రాంగాన్ని సిద్ధం చేయడం ఈ కేంద్రం ప్రధాన లక్ష్యం. కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ఈ నెల 18న రాత్రి దిల్లీ నుంచి గన్నవరం చేరుకొని,సీఎం నివాసంలో విందులో పాల్గొని,విజయవాడలో బస చేస్తారు. 19న ఉదయం ఎన్‌ఐడీఎం కేంద్రం, ఎన్డీఆర్‌ఎఫ్‌ పదో బెటాలియన్‌ను ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రులు, ఇతర ప్రముఖులు పాల్గొననున్నారు.