SCO Event: పాకిస్థాన్ మ్యాప్‌పై భారత్ అభ్యంతరం; తోకముడిచిన దాయాది దేశం
షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్‌సీఓ) ఫ్రేమ్‌వర్క్‌లో భాగంగా ఏర్పాటు చేసిన మిలటరీ మెడిసిన్ స్పెషలిస్ట్ కాన్ఫరెన్స్‌కు పాకిస్థాన్ మంగళవారం హాజరుకాలేదు. కశ్మీర్‌కు సంబంధించిన దేశ సరిహద్దులను తప్పుగా మార్చి పాక్ ప్రదర్శించాలని చూసింది. దీనిపై భారత్ అభ్యంతరం చెప్పడంతోనే పాకిస్తాన్ గైర్హాజరైనట్లు తెలుస్తోంది. ముందస్తు ఎస్‌సీఓ సమావేశంలో పాక్ అధికారులు కశ్మీర్‌ను తమ దేశంలో భాగంగా చిత్రీకరించే మ్యాప్‌ను ప్రదర్శించారు. ఈ విషయం విదేశాంగ మంత్రిత్వ శాఖ దృష్టికి రావడంతో, వాస్తవమైన మ్యాప్‌ను ప్రదర్శించాలని, లేకుంటే సెమినార్‌కు దూరంగా ఉండాలని పాకిస్థాన్‌ను ఉద్దేశించి భారత్ వ్యాఖ్యానించిట్లు ఒక ప్రతినిధి చెప్పారు. దీంతో పాకిస్థాన్ బృందం దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.
పాకిస్థాన్ గైర్హాజరు వల్ల సమావేశాలకు ఎలాంటి ఇబ్బంది కలగలేదు: భారత్
జూలైలో ఎస్‌సీఓ సమ్మిట్‌కు ఆతిథ్యం ఇవ్వడానికి భారతదేశం సిద్ధమవుతున్న తరుణంలో ఈఘటన జరగడంపై భారత్ చాలా సీరియస్‌గా తీసుకుంది. పాకిస్థాన్ హాజరు కాకపోవడం వల్ల దిల్లీలోని ఇన్‌స్టిట్యూట్ ఫర్ డిఫెన్స్ స్టడీస్ అండ్ అనాలిసిస్ (ఐడీఎస్ఏ)లో నిర్వహించిన ఎస్‌సీఓ ఫ్రేమ్‌వర్క్‌లోని ఇతర షెడ్యూల్ సమావేశాలకు ఎలాంటి ఇబ్బంది కలగలేదని భారత ప్రతినిధులు చెప్పారు. సైనిక వైద్యం, ఆరోగ్య సంరక్షణ, మహమ్మారి నియంత్రణలో శ్రేష్టమైన పద్ధతులను భాగస్వామ్యం చేయాలనే లక్ష్యంతో ఈ సెమినార్‌ను నిర్వహించారు. ఎస్‌సీఓలోని ఎనిమిది సభ్య దేశాలు భవిష్యత్ సవాళ్లను ఎలా ఎదుర్కోవచ్చో అన్వేషించడానికి ఈ థింక్ ట్యాంక్ కాన్ఫరెన్స్‌ను ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు.