Page Loader
బైజూస్‌ కంపెనీ లేఆఫ్.. బలవంతంగా రాజీనామా చేయించారని కన్నీళ్లు పెట్టుకున్న ఉద్యోగి
బైజూస్‌ కంపెనీ జులుం

బైజూస్‌ కంపెనీ లేఆఫ్.. బలవంతంగా రాజీనామా చేయించారని కన్నీళ్లు పెట్టుకున్న ఉద్యోగి

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Jul 28, 2023
06:48 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రముఖ ఎడ్‌టెక్‌ దిగ్గజం బైజూస్‌ సంస్థపై ఓ మహిళా ఉద్యోగి సంచలన ఆరోపణలు చేశారు. దీంతో మరోసారి బైజూస్‌ వార్తలకెక్కింది. బలవంతంగా తనతో రాజీనామా చేయించారని ఆమె కన్నీరుమున్నీరయ్యారు. జీతం ఇవ్వబోమని బెదిరించి, తనను ఒత్తిడికి గురి చేసి విధులకు రాజీనామా చేయించారని వాపోయింది. ఈ క్రమంలోనే తన ఉద్యోగం పోయిందని బోరుమన్నారు. ఇప్పటికేే బైజూస్ (BYJU'S) ఈడీ దాడులు, ఆర్థిక మాంద్యం, లేఆఫ్‌ సమస్యలతో గత కొంత కాలంగా సతమతమవుతోంది. తాజాగా సంస్థలో లేఆఫ్‌కు గురైన ఓ మహిళా ఉద్యోగి బైజూస్‌పై తీవ్ర ఆరోపణలు గుప్పించారు. బైజూస్ ఇటు ఉద్యోగులను, అటు కస్టమర్లను మోసం చేస్తోందని ఆరోపించారు. తనకు రావాల్సిన బకాయిలను చెల్లించకుండా వేధిస్తోందని భావోద్వేగానికి గురయ్యారు.

details

ప్రభుత్వమే నన్ను ఆదుకోవాలని కన్నీరు పెట్టుకున్న ఆకాంక్ష ఖేమ్కా

ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం సాయం కోరుతూ లింక్డ్‌ఇన్‌ లో వీడియో రిలీజ్ చేశారు. ఆకాంక్ష ఖేమ్కా సంవత్సరన్నర పాటు సంస్థలో అకాడమిక్‌ స్పెషలిస్ట్‌గా విధులు నిర్వర్తించారు. లేఆఫ్‌ ప్రక్రియలో భాగంగా ఆమె పేరును జాబితాలో పొందుపర్చారు. దీనిపై మనస్తాపం చెందిన ఆకాంక్ష తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. ఉన్నఫలంగా రాజీనామా చేయాలని బైజూస్‌ లేఖ పంపిందని, లేని పక్షంలో వేతనం నిలిపేస్తామని హెచ్చరించినట్లు బాధితురాలు తెలిపింది.తనకు రావాల్సిన చెల్లింపులనూ ఇవ్వలేదన్నారు. మరోవైపు బాధిత కుటుంబానికి తానొక్కరే ఆధారమని, తన భర్తకు ఆరోగ్యం సరిగ్గా లేదని ఆందోళన వ్యక్తం చేసింది. నెలవారీ లోన్లు, ఈఎంఐలు చెల్లించాల్సి ఉందని వాపోయారు. జీతం, బకాయిలు ఇవ్వకపోతే తాను, తన కుటుంబం ఎలా బతకాలని తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది.