అమెరికాలో త్వరలోనే ఆర్థిక మాంద్యం.. భారత్ సహా ప్రపంచంపైనా ప్రభావం
అగ్రరాజ్యం అమెరికాను ఆర్థికమాంద్యం భయాలు వెంటాడుతున్నాయి. ఈ మేరకు త్వరలోనే మాంద్యం ప్రారంభం కానున్నట్లు సంకేతాలు వెలువడుతున్నాయి. యూఎస్ఏలోని వ్యాపార సంస్థల సూచికలు గత నెలలో బలహీనంగా మారాయి. అయితే కాన్ఫరెన్స్ బోర్డు లీడింగ్ ఎకనామిక్ ఇండెక్స్, భవిష్యత్ ఆర్థిక కార్యకలాపాలను గురువారం అంచనా వేసింది. జూన్ నెలలో ఎకనామిక్స్ ఇండెక్స్ 0.7 శాతం మేర క్షీణించింది. ఈ దశలో 106.1కి పడిపోయిందని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. జూన్ నెలలో జరిగిన బిజినెస్ ఇండెక్స్ లను పరిశీలిస్తే రానున్న కొద్ది నెలల్లో ఆర్థిక కార్యకలాపాలు మందగించే ప్రమాదం ఉన్నట్లు కాన్ఫరెన్స్ బోర్డ్‌లోని సీనియర్ మేనేజర్ జస్టినా జబిన్స్కాలా మోనికా ఆందోళన వ్యక్తం చేశారు.
అమెరికా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతే భారత్ పైనా ప్రభావం
ప్రస్తుతం మూడో త్రైమాసికం నుంచి 2024 మొదటి త్రైమాసికం వరకు అగ్రదేశం ఆర్థిక వ్యవస్థ మాంద్యంలో పడొచ్చని కాన్ఫరెన్స్ బోర్డు భావిస్తోంది. పెరిగిన ధరలు, కఠిన ద్రవ్య విధానం, కష్టమైన క్రెడిట్ పాలసీలు, ప్రభుత్వ వ్యయాలు తగ్గడం తదితర అంశాలు ఆర్థికాభివృద్ధిని మందకోడిగా సాగేలా చేస్తున్నట్లు జబిన్స్కాలా మోనికా వివరించారు. గతేడాది జూన్, డిసెంబర్ త్రైమాసికం మధ్య 3.8 శాతం వృద్ధితో పోలిస్తే గత ఆరు నెలల్లో 4.2 శాతం ఆర్థికవృద్ధి పతనమైంది. ఈ క్రమంలోనే పలు కార్పోరేట్, అంతర్జాతీయ స్థాయి (CORPORATE, MNC) కంపెనీలు ఖర్చులను తగ్గించుకునేందుకు లే ఆఫ్ ప్రకటిస్తున్నాయి. అమెరికా ఆర్థికవ్యవస్థ కుప్పకూలిపోతే భారతదేశం సహా ప్రపంచ ఆర్థిక వ్యవస్థపైనా ప్రభావం చూపిస్తుందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.