DK Shivakumar: కర్ణాటక సీఎంగా నేడు డీకే శివకుమార్ పట్టాభిషేకం.. తొలి విడతలో 13 మంది మంత్రుల ప్రమాణం
ఈ వార్తాకథనం ఏంటి
కర్ణాటక రాజకీయాల్లో నేడు కీలక పరిణామం చోటుచేసుకోనుంది. ముఖ్యమంత్రి పదవిపై చాలా కాలంగా కొనసాగిన చర్చలు, రాజకీయ సమీకరణాలకు తెరదించుతూ కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు. బెంగళూరులోని లోక్‌భవన్ గ్లాస్ హౌస్‌లో బుధవారం సాయంత్రం 4:05 గంటలకు జరగనున్న కార్యక్రమంలో గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. 64 ఏళ్ల డీకే శివకుమార్‌తో పాటు తొలి విడత మంత్రివర్గ విస్తరణలో భాగంగా సుమారు 13 మంది మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.
వివరాలు
కాంగ్రెస్ ట్రబుల్‌షూటర్ నుంచి సీఎం వరకు
కాంగ్రెస్ పార్టీలో సంక్షోభాలను సమర్థంగా ఎదుర్కొనే నాయకుడిగా పేరొందిన డీకే శివకుమార్ ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. సిద్ధరామయ్య రాజీనామా అనంతరం ఆయనను కాంగ్రెస్ శాసనసభా పక్షం (సీఎల్పీ) నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకుంది. ప్రమాణ స్వీకారానికి ముందు స్పందించిన డీకే శివకుమార్, ముఖ్యమంత్రి పదవి తనకు కేవలం కల మాత్రమే కాదని, ఎన్నో ఏళ్ల కృషి, అంకితభావానికి లభించిన గుర్తింపని అన్నారు. నెహ్రూ-గాంధీ కుటుంబం తనపై ఉంచిన విశ్వాసానికి కృతజ్ఞతలు తెలుపుతూ, బెంగళూరు,కర్ణాటక అభివృద్ధి దేశ ప్రతిష్ఠను ప్రపంచానికి చాటుతుందని పేర్కొన్నారు. రైతులు, మహిళలు, యువతకు ప్రాధాన్యం ఇస్తూ రాష్ట్రంలో కొత్త "యువ యుగం" ప్రారంభిస్తానని తన లక్ష్యాలను వెల్లడించారు.
వివరాలు
తొలి విడత మంత్రివర్గంలో ఎవరెవరు?
మంత్రివర్గ విస్తరణపై కాంగ్రెస్ ఇంకా అధికారిక ప్రకటన చేయనప్పటికీ,తొలి విడతలో పలువురు సీనియర్ నేతలకు చోటు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. మాజీ సీఎం సిద్ధరామయ్య కుమారుడు యాతీంద్రతో పాటు జి. పరమేశ్వర,కె.హెచ్. మునియప్ప, యు.టి. ఖాదర్, కె.జె. జార్జ్, కృష్ణ బైరేగౌడ, ఎం.బి. పాటిల్, ప్రియాంక్ ఖర్గే, సతీష్ జార్కిహోళి, రామలింగారెడ్డి, దినేష్ గుండూరావు, బైరతి సురేష్, ఈశ్వర్ ఖండ్రే వంటి నేతలకు మంత్రివర్గంలో అవకాశం లభించే అవకాశముంది. కుల, ప్రాంతీయ సమతూకాన్ని దృష్టిలో పెట్టుకుని సీనియర్ దళిత నేత జి. పరమేశ్వరను ఏకైక ఉప ముఖ్యమంత్రిగా నియమించే అవకాశాలు ఉన్నాయి. అలాగే సీనియర్ కాంగ్రెస్ నేత హెచ్.కె. పాటిల్ అసెంబ్లీ స్పీకర్ పదవిని చేపట్టే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.
వివరాలు
సిద్ధరామయ్యకు జాతీయ స్థాయిలో బాధ్యతలు
అధికార మార్పిడి ప్రక్రియను సాఫీగా నిర్వహించిన మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు కాంగ్రెస్ అధిష్ఠానం కీలక బాధ్యతలు అప్పగించింది. పార్టీ అత్యున్నత నిర్ణయాత్మక కమిటీ అయిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సభ్యుడిగా ఆయనను నియమించింది. ఈ మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కె.సి. వేణుగోపాల్ ఉత్తర్వులు జారీ చేశారు.
వివరాలు
ప్రమాణ స్వీకారానికి భారీ ఏర్పాట్లు
డీకే శివకుమార్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో పాటు ఇండియా కూటమికి చెందిన పలువురు ముఖ్యమంత్రులు హాజరుకానున్నారు. వివిధ మఠాలకు చెందిన మతాధిపతులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. అలాగే జ్యోతిష్యుల సూచనల మేరకు లోక్‌భవన్ గ్లాస్ హౌస్‌లో ఏర్పాటు చేసిన ప్రధాన వేదిక దిశను పడమర ముఖం నుంచి తూర్పు ముఖంగా మార్చడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దీంతో డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం కర్ణాటక రాజకీయాల్లో కొత్త అధ్యాయానికి నాంది పలకనుంది.