డీఎంకే మంత్రి సెంథిల్ బాలాజీని అరెస్ట్ చేసిన ఈడీ; ఛాతిలో నొప్పితో ఆస్పత్రిలో చేరిక
ఈ వార్తాకథనం ఏంటి
మనీలాండరింగ్ కేసుకు సంబంధించి తమిళనాడు విద్యుత్, ఎక్సైజ్ శాఖ మంత్రి సెంథిల్ బాలాజీని బుధవారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్టు చేసింది.
డీఎంకేలో చేరడానికి ముందు సెంథిల్ 2011నుంచి 2015వరకు ఏఐఏడీఎంకే ప్రభుత్వంలో రవాణా శాఖ మంత్రిగా పని చేశారు.
ఆ సమయంలో క్యాష్ ఫర్ జాబ్ స్కామ్‌కు పాల్పడినట్లు ఆభియోగాలు మోపుతూ మనీలాండరింగ్ నిరోధక చట్టం(పీఎంఎల్‌ఏ) కింద సుదీర్ఘ విచారణ తర్వాత మంత్రిని ఈడీ అరెస్టు చేసింది.
మంత్రి నివాసంలో 24 గంటల క్రితమే ఈడీ దాడులు ప్రారంభించింది. తెల్లవారుజామున 1.30 గంటలకు ఆయన్ను అరెస్టు చేసేందుకు ఈడీ ఏర్పాట్లు చేస్తుండగా, ఇదే సమయంలో తనకు ఛాతీలో నొప్పిగా ఉన్నట్లు చెప్పడంతో వెంటనే చెన్నైలోని ఓమందురార్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఈడీ
ఆస్పత్రి బయట హై డ్రామా
విద్యుత్, ఎక్సైజ్ శాఖ మంత్రి సెంథిల్ బాలాజీని ఆస్పత్రికి తీసుకొచ్చినట్లు కార్యకర్తలకు తెలియడంతో బయట హై డ్రామా నడిచింది. ఈ క్రమంలో ఈడీ చర్యకు వ్యతిరేకంగా మంత్రి మద్దతుదారులు నినాదాలు చేశారు.
అనంతరం వైద్యులు మంత్రిని ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసీయూ)కి తరలించారు.
సెంథిల్ బాలాజీని వైద్య పరీక్షల నిమిత్తం తీసుకొచ్చిన చెన్నైలోని ఓమందురార్ ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్‌ను మోహరించారు.
అక్రమంగా పెట్టిన కేసులపై న్యాయపరంగా పోరాడుతామని సెంథిల్ బాలాజీ తరపు న్యాయవాది తెలిపారు. సెంథిల్ బాలాజీ చికిత్స పొందుతున్నారని డీఎంకే మంత్రి ఉదయనిధి స్టాలిన్ తెలిపారు.
బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం చేస్తున్న బెదిరింపు రాజకీయాలకు మేం భయపడేది లేదని ఆయన అన్నారు.