Happiest State: భారత్‌లోనే అత్యంత సంతోషకరమైన రాష్ట్రం ఏదో తెలుసా?
భారతదేశంలో అత్యంత సంతోషకరమైన రాష్ట్రంగా మిజోరం నిలిచినట్లు ఓ అధ్యయనం పేర్కొంది. గురుగ్రామ్‌లోని మేనేజ్‌మెంట్ డెవలప్‌మెంట్ ఇనిస్టిట్యూట్‌లో స్ట్రాటజీ ప్రొఫెసర్‌గా పని చేస్తున్న రాజేష్ కె.పిలానియా నిర్వహించిన అధ్యయనంలో మిజోరం దేశంలోనే సంతోషకరమైన రాష్ట్రంగా తేలింది. మిజోరం దేశంలోనే 100 శాతం అక్షరాస్యత సాధించిన రెండో రాష్ట్రం కావడం గమనార్హం. అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో కూడా విద్యార్థులు చదవుకోవడానికి అవకాశాలను కల్పిస్తోంది. కుటుంబ సంబంధాలు, పని సంబంధిత సమస్యలు, సామాజిక సమస్యలు, దాతృత్వం, మతం, ఆనందంపై కరోనా ప్రభావం, సహా ఆరు పారామీటర్ల ఆధారంగా మిజోరం ఆనంద సూచికను రూపొందించినట్లు నివేదిక పేర్కొంది.
ఉపాధ్యాయులు, విద్యార్థుల మధ్య మంచి స్నేహ సంబంధం
మిజోరం ఐజ్వాల్‌లోని ప్రభుత్వ మిజో హైస్కూల్‌లోని ఓ విద్యార్థి, తన తండ్రి చిన్నతనంలో కుటుంబాన్ని విడిచిపెట్టడంతో చాలా ఇబ్బందులను ఎదుర్కోవలసి వచ్చింది. అయినప్పటికీ, చదువులో అతను రాణిస్తున్నాడు. ఆ విద్యార్థి చార్టర్డ్ అకౌంటెంట్ లేదా సివిల్ సర్వీసెస్ పరీక్షలు రాయాలని ఆశిస్తున్నాడని నివేదిక పేర్కొంది. అక్కడి ఉపాధ్యాయుల ప్రోత్సాహం వల్లే ఇది సాధ్యమైనట్లు నివేదిక చెప్పింది. ఉపాధ్యాయులు తమతో మంచి స్నేహితులుగా ఉంటారని, వారితో ఏదైనా చెప్పడానికి భయపడబోమని ఓ విద్యార్థి చెప్పినట్ల తన నివేదికలో రాజేష్ కె.పిలానియా చెప్పారు. మిజోరంలోని విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో ఉపాధ్యాయులు క్రమం తప్పకుండా సమావేశమవుతారు. వారు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడానికి ఈ సమావేశం దోహదపడుతుందని నివేదిక పేర్కొంది.
మిజోరంలో చదువు కోసం పిల్లలపై తల్లిదండ్రుల ఒత్తిడి చాలా తక్కువ
మిజోరం సామాజిక నిర్మాణం కూడా యువత ఆనందానికి దోహదం చేస్తుందని రాజేష్ కె.పిలానియా పేర్కొన్నారు. ఇక్కడి యువత తల్లిదండ్రుల పెంపకం వల్ల చాలా సంతోషంగా ఉన్నట్లు నివేదిక చెప్పింది. అలాగే ఇక్కడ చదువుల కోసం తల్లిదండ్రుల ఒత్తిడి చాలా తక్కువ అని ఎబెన్-ఎజర్ బోర్డింగ్ స్కూల్ టీచర్, సిస్టర్ లాల్రిన్మావి ఖియాంగ్టే చెప్పారు. మిజో కమ్యూనిటీలోని ప్రతి బిడ్డ, లింగ భేదం లేకుండా సంపాదించడం ప్రారంభిస్తారని నివేదిక పేర్కొంది. మిజోరంలో ఏ పనిని కూడా చిన్నగా భావించరు. యువకులు సాధారణంగా 16 లేదా 17 సంవత్సరాల వయస్సులో ఉపాధిని పొందుతారు. ఉపాధి విషయంలో బాలికలు, అబ్బాయిల మధ్య ఎటువంటి వివక్ష ఉండదని రాజేష్ కె.పిలానియా నివేదిక పేర్కొంది.