LOADING...
Donald Trump: భారత్‌కు ట్రంప్‌ గుడ్‌న్యూస్‌.. టారిఫ్‌లు 25% నుంచి 18%కు తగ్గింపు
భారత్‌కు ట్రంప్‌ గుడ్‌న్యూస్‌.. టారిఫ్‌లు 25% నుంచి 18%కు తగ్గింపు

Donald Trump: భారత్‌కు ట్రంప్‌ గుడ్‌న్యూస్‌.. టారిఫ్‌లు 25% నుంచి 18%కు తగ్గింపు

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 02, 2026
11:52 pm

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ భారత్‌కు శుభవార్త చెప్పారు. భారత్‌పై అమెరికా విధిస్తున్న టారిఫ్‌లను 25 శాతం నుంచి 18 శాతానికి తగ్గిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ విషయాన్ని తన స్వంత సామాజిక మాధ్యమం 'ట్రూత్‌ సోషల్‌' ద్వారా వెల్లడించారు. ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీతో ట్రంప్‌ ఫోన్‌లో మాట్లాడిన కొద్దిసేపటికే ఈ నిర్ణయం ప్రకటించటం ప్రాధాన్యతను సంతరించుకుంది. రష్యా నుంచి ముడిచమురు కొనుగోలు చేస్తున్న భారత్‌పై ఒత్తిడి తీసుకురావాలనే ఉద్దేశంతో ట్రంప్‌ ప్రభుత్వం ఇటీవల అదనపు సుంకాలు విధించిన విషయం తెలిసిందే.

వివరాలు 

భారత్‌పై విధించే ప్రతీకార సుంకాన్ని 25 శాతం నుంచి 18 శాతానికి తగ్గింపు 

ఈ సందర్భంగా ట్రంప్‌ చేసిన పోస్టులో, "ఈ రోజు భారత ప్రధాని మోదీతో మాట్లాడాను. ఆయన నా అత్యంత సన్నిహిత మిత్రుల్లో ఒకరు. శక్తివంతమైన నాయకుడు. వాణిజ్యం, ఉక్రెయిన్‌-రష్యా యుద్ధం సహా అనేక అంశాలపై మేం చర్చించాం. రష్యా నుంచి చమురు కొనుగోళ్లను నిలిపివేసి, అమెరికా మరియు వెనెజువెలా నుంచి మరింత చమురు కొనుగోలు చేయడానికి మోదీ అంగీకరించారు. ఈ నేపథ్యంలో అమెరికా-భారత్‌ మధ్య తక్షణమే అమల్లోకి వచ్చే వాణిజ్య ఒప్పందానికి మేము అంగీకరించాం. దీని ప్రకారం భారత్‌పై విధించే ప్రతీకార సుంకాన్ని 25 శాతం నుంచి 18 శాతానికి తగ్గిస్తున్నాం. అదేవిధంగా, అమెరికాపై భారత్‌ విధిస్తున్న సుంకాలను పూర్తిగా తొలగించేందుకు భారత ప్రభుత్వం ముందుకొస్తోంది.

వివరాలు 

భవిష్యత్తులో భారత్‌తో మా సంబంధాలు మరింత బలపడతాయి: ట్రంప్ 

500 బిలియన్‌ డాలర్లకు మించిన విలువైన ఇంధన, సాంకేతిక, వ్యవసాయ, బొగ్గు తదితర ఉత్పత్తులను కొనుగోలు చేస్తామని మోదీ హామీ ఇచ్చారు. భవిష్యత్తులో భారత్‌తో మా సంబంధాలు మరింత బలపడతాయి" అని ట్రంప్‌ పేర్కొన్నారు. అయితే, రష్యా నుంచి చమురు కొనుగోళ్లను నిలిపివేస్తున్న అంశంపై భారత్‌ ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.

Advertisement

వివరాలు 

చాలా ఆనందంగా ఉంది: మోదీ

టారిఫ్‌లను 25 శాతం నుంచి 18 శాతానికి తగ్గిస్తూ ట్రంప్‌ తీసుకున్న నిర్ణయంపై ప్రధాని నరేంద్ర మోదీ ఆనందం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయానికి గాను 140 కోట్ల మంది భారత ప్రజల తరఫున ట్రంప్‌కు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు ఆయన 'ఎక్స్‌'లో పోస్టు చేశారు.

Advertisement

వివరాలు 

చాలా ఆనందంగా ఉంది: మోదీ

"నా ప్రియ మిత్రుడు ట్రంప్‌తో మాట్లాడటం చాలా సంతోషంగా ఉంది. భారత్‌లో తయారైన ఉత్పత్తులపై సుంకాన్ని 18 శాతానికి తగ్గించినందుకు హర్షం వ్యక్తం చేస్తున్నాను. ప్రపంచంలోని రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు, అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలు కలిసి పనిచేస్తే ప్రజలకు మేలు చేకూరడమే కాకుండా పరస్పర సహకారానికి విస్తృత అవకాశాలు ఏర్పడతాయి. ప్రపంచ శాంతి, శ్రేయస్సు కోసం డొనాల్డ్‌ ట్రంప్‌ నాయకత్వం కీలకమైనది. శాంతి కోసం ఆయన చేస్తున్న ప్రయత్నాలకు భారత్‌ పూర్తి మద్దతు ఇస్తోంది. ఇంతకు ముందెన్నడూ లేని విధంగా ఇరుదేశాల భాగస్వామ్యాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు ఆయనతో కలిసి పని చేయాలని ఆశిస్తున్నాను" అని మోదీ తన పోస్టులో పేర్కొన్నారు.

Advertisement