Jaishankar: పోలండ్ మంత్రికి జైశంకర్ చురకలు.. ఉగ్రవాదంపై కఠిన హెచ్చరిక
ఈ వార్తాకథనం ఏంటి
దిల్లీలో పోలాండ్ ఉప ప్రధాని, విదేశాంగ మంత్రి రాడోస్లావ్ సికోర్క్సీతో భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ కీలక భేటీ నిర్వహించారు. ఈ సమావేశంలో భారత్-పోలండ్ ద్వైపాక్షిక సంబంధాలు, అంతర్జాతీయ పరిణామాలపై విస్తృతంగా చర్చలు జరిపారు. ఈ సందర్భంగా గతేడాది అక్టోబర్‌లో పాకిస్థాన్ పర్యటన సమయంలో జమ్ముకశ్మీర్ అంశంపై రాడోస్లావ్ చేసిన వ్యాఖ్యలను జైశంకర్ ప్రస్తావిస్తూ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఉగ్రవాదాన్ని భారత్ ఎప్పటికీ వ్యతిరేకిస్తూనే ఉంటుందని జైశంకర్ స్పష్టం చేశారు. భారత్‌తో స్నేహబంధం కోరుకునే దేశాలు కూడా ఉగ్రవాదంపై ఏ మాత్రం సానుకూలంగా లేదా మెతక వైఖరితో వ్యవహరించకూడదని హితవు పలికారు. ఉగ్రవాదం చివరికి ప్రపంచ దేశాలన్నింటికీ ముప్పుగా మారే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
వివరాలు
భారత్-పోలండ్ సంబంధాలపై జైశంకర్
సరిహద్దు ఉగ్రవాదం వల్ల భారత్ ఎదుర్కొంటున్న సమస్యలు రాడోస్లావ్‌కు బాగా తెలిసినవేనని జైశంకర్ తెలిపారు. అలాంటి పరిస్థితుల్లో ఉగ్రవాదాన్ని తగ్గించేందుకు చర్యలు తీసుకోవాల్సిందే గానీ, సరిహద్దుల్లో ఉగ్రవాదానికి ఆజ్యం పోయే విధానాలు అనుసరించకూడదని స్పష్టంగా చెప్పారు. ప్రపంచం ఇప్పటికే అనేక సంక్షోభాలతో ఇబ్బంది పడుతున్న వేళ, ప్రత్యేకంగా భారత్‌ను మాత్రమే లక్ష్యంగా చేసుకోవడం అన్యాయమని వ్యాఖ్యానించారు. భారత్-పోలండ్ సంబంధాలపై మాట్లాడిన జైశంకర్, ఇరుదేశాల మధ్య బంధాలు స్థిరంగా ముందుకు సాగుతున్నాయని చెప్పారు. అయితే ఆ సంబంధాలు మరింత బలపడాలంటే నిరంతర అప్రమత్తత, పరస్పర గౌరవం అవసరమని పేర్కొన్నారు.
వివరాలు
భారత్‌తో కలిసి పని చేయడానికి పోలండ్ సిద్ధం: రాడోస్లావ్ సికోర్క్సీ
జైశంకర్ వ్యాఖ్యలకు స్పందించిన రాడోస్లావ్ సికోర్క్సీ, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్‌తో కలిసి పని చేయడానికి పోలండ్ సిద్ధంగా ఉందని తెలిపారు. తమ దేశం కూడా ఉగ్ర సమస్యలను ఎదుర్కొంటోందని చెప్పారు. ఇదిలా ఉండగా, గతేడాది పాకిస్థాన్ పర్యటన సందర్భంగా రాడోస్లావ్ జమ్మూకశ్మీర్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం అప్పట్లో చర్చనీయాంశమైంది. కశ్మీర్ సమస్యను సామరస్యంగా పరిష్కరించాలని పాకిస్థాన్ నేతలతో కలిసి ఆయన ఉమ్మడి ప్రకటన విడుదల చేశారు.