Flood Ration: ఇంటింటికి వరద సాయం పంపిణీ ప్రారంభం.. రేషన్ కార్డు లేనివారు ఇలా తీసుకోవచ్చు
విజయవాడలో భారీ వర్షాలు, వరదలు సృష్టించిన విపత్తు వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షాలు తగ్గినా, వరద పరిస్థితి ఇంకా కొనసాగుతూ, పలు కాలనీలు మోకాళ్ళ లోతు నీటితో నిండిపోయాయి. ఈ నేపథ్యంలో,బాధితులకు సరుకులు అందించేందుకు అధికారులు, స్వచ్ఛంద సంస్థలు సహకరించి,పడవలు, వాహనాల ద్వారా ఆహారం, నీరు అందిస్తున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తూ, బాధితులకు భరోసా కల్పిస్తున్నారు. ఏపీ ప్రభుత్వం ఈ పరిస్థితిని సమర్థవంతంగా ఎదుర్కొనడానికి కొత్త కార్యక్రమాలు చేపడుతోంది. ఆరు రకాల నిత్యావసర సరుకులతో కూడిన రేషన్ కిట్లు పదిలక్షల కుటుంబాలకు అందించనుంది. ఈ కిట్లలో 25 కిలోల బియ్యం,కేజీ కందిపప్పు,కేజీ పంచదార,లీటరు వంటనూనె, 2 కిలోల ఉల్లిపాయలు, రెండు కేజీల ఆలుగడ్డలు ఉంటాయి.
12 గ్యాస్ సర్వీస్ కేంద్రాలు..
రేషన్ కార్డు లేనివారు కూడా ఆధార్, వేలిముద్ర ఆధారంగా ఈ సరుకులను పొందవచ్చు. అంతేకాకుండా, గ్యాస్ సదుపాయాలు కల్పించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. 12 గ్యాస్ సర్వీస్ కేంద్రాలు కూడా ముంపు ప్రాంతాల్లో ఏర్పాటు చేయబోతున్నారు. ప్రభుత్వ చర్యలతో నిత్యావసర సరుకులను ఇంటింటికీ మొబైల్ డెలివరి యూనిట్ల ద్వారా అందించే పథకాన్ని కూడా అమలు చేస్తున్నారు. వరద ప్రభావితులకు సహాయం అందించడానికి ప్రభుత్వం రేషన్ సరుకులను మొబైల్ డెలివరీ యూనిట్ల ద్వారా ఇంటి వద్దకే చేరవేస్తోంది. ఈ నిత్యావసర వస్తువులను చౌకధరల దుకాణదారులు, సచివాలయ సిబ్బంది, MDU ఆపరేటర్లు బాధితుల ఇంటివద్ద MDU వాహనాల ద్వారా పంపిణీ చేస్తున్నారు.
రేషన్ కార్డు లేని వారికి ఆధార్ ఆధారంగా సరుకులు
ముంపుప్రాంతాల ప్రజలు నిత్యావసర వస్తువులను పొందడానికి ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరం లేదని ప్రభుత్వం తెలిపింది. రేషన్ లేదా ఆధార్ కార్డుతో MDUవాహనం వచ్చినప్పుడు వేలిముద్ర ద్వారా సరుకులను పొందవచ్చు. విజయవాడ BRTS రోడ్డులో వరద ప్రభావిత ప్రాంతాలకు ఉచితంగా సరుకులను పంపిణీ చేసేందుకు సుమారు 1200వాహనాలను సిద్ధం చేసినట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఈ-పోస్ విధానంలో రేషన్ కార్డు లేని వారికి ఆధార్ ఆధారంగా సరుకులు పంపిణీ చేయనున్నారు.పౌర సరఫరాలు,రెవెన్యూ,పోలీసుశాఖలు సమన్వయంతో ఈసహాయ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి. శుక్రవారం ఉదయం నుంచి వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉచిత నిత్యావసరసరుకుల కిట్లను పంపిణీ చేయనున్నారు. గురువారం సాయంత్రం విజయవాడలో ట్రయల్ రన్ నిర్వహించి,మంత్రి మనోహర్, ఉన్నతాధికారులు ఈ కార్యక్రమాన్ని పరిశీలించారు.