
Telangana: తెలంగాణ డిగ్రీ అడ్మిషన్లలో భారీగా సీట్లు ఖాళీ.. 64 కళాశాలల్లో జీరో అడ్మిషన్లు!
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణ రాష్ట్రంలో డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్ (దోస్త్) ద్వారా డిగ్రీ ప్రవేశాల కోసం నిర్వహించిన వెబ్ ఆధారిత కౌన్సెలింగ్ జూలై 5న పూర్తయ్యింది. ఈ దశలో సంచలనకరమైన గణాంకాలు వెలుగు చూశాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మొత్తం 4.36 లక్షల డిగ్రీ సీట్లలో 2.94 లక్షలకుపైగా సీట్లు ఖాళీగా మిగిలాయి. ఇది దాదాపు 3 లక్షల సీట్లకు సమానం. మరింత దిగ్భ్రాంతికర విషయం ఏమిటంటే, మొత్తం 64 డిగ్రీ కళాశాలల్లో ఒక్క విద్యార్థి కూడా ప్రవేశం పొందలేదు. తెలంగాణ ఉన్నత విద్యా మండలి విడుదల చేసిన అధికారిక గణాంకాల ప్రకారం, 2025-26 విద్యా సంవత్సరానికి ఈ 64 కళాశాలలు ఎలాంటి అడ్మిషన్లను నమోదు చేయలేకపోయాయి.
వివరాలు
కాకతీయ విశ్వవిద్యాలయం పరిధిలో అత్యధికంగా 22 కళాశాలలు
ఈ విద్యాసంస్థలు ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయి. వాటిలో కలిపి 20,260 సీట్లు అందుబాటులో ఉన్నా, ఒక్కటీ భర్తీ కాలేదు. విశ్వవిద్యాలయాల వారీగా చూస్తే,కాకతీయ విశ్వవిద్యాలయం పరిధిలో అత్యధికంగా 22 కళాశాలలు అడ్మిషన్ల లోపంతో ఉన్నాయి. మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయ పరిధిలో 14,ఉస్మానియా పరిధిలో 13 కళాశాలలు పూర్తిగా ఖాళీగా ఉన్నాయి. పాలమూరు విశ్వవిద్యాలయ పరిధిలో ఐదు కళాశాలలు, శాతవాహన విశ్వవిద్యాలయం పరిధిలో ఒక ప్రైవేట్, ఒక ప్రభుత్వ కళాశాల కూడా ఒక్కరికీ అడ్మిషన్ ఇవ్వలేకపోయాయి. మొత్తంగా మూడు దశల వెబ్ కౌన్సెలింగ్ అనంతరం, 957 ప్రభుత్వ, విశ్వవిద్యాలయ, ప్రైవేట్ కళాశాలల్లో అందుబాటులో ఉన్న 4,36,927 సీట్లలో కేవలం 1,43,037 సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. మిగిలిన 2,93,890 సీట్లు ఖాళీగానే ఉన్నాయి.
వివరాలు
విశ్వవిద్యాలయాల వారీగా అడ్మిషన్ల శాతం తక్కువ
విశ్వవిద్యాలయాల వారీగా అడ్మిషన్ల శాతం గణనీయంగా తక్కువగా ఉంది. ఉదాహరణకు, ఉస్మానియా విశ్వవిద్యాలయం పరిధిలోని 1,95,397 సీట్లలో కేవలం 34 శాతం సీట్లకే అడ్మిషన్లు వచ్చాయి. అలాగే కాకతీయ విశ్వవిద్యాలయ పరిధిలోని 1,07,080 సీట్లలో కేవలం 31 శాతం మాత్రమే భర్తీ అయ్యాయి. ఇక, ఉన్నత విద్యా మండలి,కాలేజియేట్ ఎడ్యుకేషన్ కమిషనరేట్ సంయుక్తంగా 'ఇంట్రా కాలేజీ అడ్మిషన్' ప్రక్రియను ప్రారంభించాయి. ఒకే కళాశాలలో కోర్సు మార్చాలనుకునే విద్యార్థులు జూలై 9, 10 తేదీలలో వెబ్ ఆప్షన్లను వినియోగించుకోవచ్చు. ఈ ప్రక్రియలో సీట్ల కేటాయింపు జూలై 11న జరుగుతుంది. ముందుగా మూడు దశల వెబ్ కౌన్సెలింగ్‌లో సీట్లు పొందినవారు మాత్రమే ఈ ఇంట్రా-ఫేజ్ కౌన్సెలింగ్‌కు అర్హులు.