Delhi: చలి తీవ్రతతో దిల్లీ గజగజ.. రైళ్లు, విమానాల రాకపోకలకు అంతరాయం
చలి తీవ్రతతో ఉత్తర భారతం గజగజలాడుతోంది. ఉష్ణోగ్రతలు క్షీణించడంతో దేశ రాజధాని దిల్లీపై పొగమంచు దట్టంగా కప్పేసింది. దిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతాల్లో బుధవారం తెల్లవారుజామున కనిష్ఠంగా 9.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. దట్టమైన మంచు కారణంగా 100 మీటర్ల దూరంలోని వాహనాలు కూడా కన్పించని పరిస్థితి నెలకొంది. గాలి నాణ్యతా సూచీ 334గా నమోదు కావడంతో వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. పొగమంచు ప్రభావంతో దిల్లీలో పలు విమానాలు, రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రాజధానికి వెళ్లే/వచ్చే రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి.
ఇబ్బందుల్లో పర్యాటకులు
దిల్లీ ఎయిర్‌పోర్టు ప్రకటన ప్రకారం, క్యాట్-3 సాంకేతికత లేని విమాన సర్వీసులకు ఆటంకం కలగొచ్చని హెచ్చరించారు. ప్రయాణికులు తమ విమానాల రాకపోకల గురించి సంబంధిత సంస్థలతో సంప్రదించాలని సూచించారు. ఇటు, ఉత్తర భారతంలోని పలు రాష్ట్రాల్లోనూ చలి ప్రభావం తీవ్రంగా ఉంది. జమ్ముకశ్మీర్‌లో హిమపాతం విస్తారంగా కురుస్తుండగా, హిమాచల్ ప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో హిమపాతం కారణంగా రహదారులను మూసివేశారు. ఈ పరిస్థితులు పర్యాటకులను తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టాయి.